పరిపాలనా పరంగా ప్రభుత్వాన్ని విమర్శించలేకనే గంజాయి రవాణా అంటూ.. తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు అన్నారు(ap ministers comments on chandrababu). గుంటూరు జీజీహెచ్‌లో అభివృద్ది పనులపై జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, ఇతర అధికారులతో ఆయన సమీక్షించారు. జీజీహెచ్‌లో కొత్త మెటర్నరీ బ్లాక్ కోసం నుంచి రూ.5.5 కోట్లు మంజూరు చేశామని.. నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు.
ఓర్వలేకే చంద్రబాబు దిల్లీ టూర్
జీజీహెచ్‌లో కొత్త మెటర్నరీ బ్లాక్ కోసం తెదేపా హయాంలోనే ఎంవోయూ కుదుర్చుకున్నా.. భవనం కోసం ఎందుకు నిధులు విడుదల చేయలేదని తెలుగుదేశం పార్టీ నేతలను ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఏమీ లేకనే.. చంద్రబాబు ఢిల్లీవెళ్లి రాష్ట్రపతి పాలన కోసం డిమాండ్ చేశారని ఎద్దేవా చేశారు. గంజాయి వ్యవహారం ఒక్క ఏపీలోనే కాదని.. దేశమంతా ఉందన్నారు. తప్పుడు ప్రచారాలు చేయవద్దని మంత్రి హితవు పలికారు.
రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చేలా చంద్రబాబు వ్యవహారం: మంత్రి అప్పలరాజు
ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు.. రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చేలా ప్రవర్తిస్తున్నారని మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు(Minister Sidiri Appalaraju on chabdrababu ) విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా యు. కొత్తపల్లి మండలం తీరప్రాంత గ్రామాల్లో మంత్రి పర్యటించారు. స్థానికంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. అనంతరం తీరప్రాంత గ్రామాల్లో సముద్ర కోతకు గురవుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఉప్పాడ చేపలరేవులో నూతనంగా నిర్మిస్తున్న హార్బర్ నిర్మాణ పనులను పర్యవేక్షించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మత్స్యకారుల సమస్యలపై ఆరా తీశారు.
జగనే శాశ్వత ముఖ్యమంత్రి..
రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఏ మత్స్యకార కుటుంబాలు వలస వెళ్లకూడదనే ఉద్దేశంతోనే ప్రతి జిల్లాకు ఓ హార్బర్‌ను ముఖ్యమంత్రి జగన్ మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి దక్కని ప్రజాదరణ జగన్‌కి దక్కిందని.. ఎప్పటికీ ఆయనే శాశ్వత ముఖ్యమంత్రి అని ధీమా వ్యక్తం చేశారు. 'రాష్ట్రంలో వైకాపా పాలన చూసి ఓర్వలేక బురదజల్లే ప్రయత్నాలను చంద్రబాబు చేస్తున్నారు. ముఖ్యమంత్రిపై పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఏం జరిగిందో చూశారు. ఇలాంటి వ్యక్తులు చంద్రబాబు వద్ద ఇంకా 8 మంది ఉన్నారు. వారికి నెలనెలా జీతాలిచ్చి ప్రభుత్వాన్ని విమర్శించాలని ప్రోత్సహిస్తున్నారు. మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు చూస్తున్నారు. ప్రజలు ఆయన్ను నమ్మే స్థితిలో లేరు'అని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు.
ఇదీ చదవండి..
chandrababu : న్యాయానికి తలొగ్గుతాం.. దుర్మార్గానికి ఎదురొడ్డుతాం: చంద్రబాబు