PAWAN ON CROP HOLIDAY: వైకాపా నిర్లక్ష్యం, తప్పిదాల వల్లే అన్నపూర్ణ వంటి కోనసీమలో క్రాప్ హాలీడే ప్రకటించే పరిస్థితి వచ్చిందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆరోపించారు. ధాన్యం అమ్మిన రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించడం, కాలువల మరమత్తులు, పూడిక తీత, గట్లు పటిష్టం వంటి పనులపై శ్రద్ధ చూపడం లేదని..రంగు మారిన ధాన్యానికి ధర ఇవ్వడం లేదని విమర్శించారు. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఇలాంటి పరిస్థితులు దాపురించడం చాలా బాధాకరమని అన్నారు. తొలకరి పంట వేయలేమని కోనసీమ రైతులు ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారని తెలిపారు. అన్నం పెట్టే రైతు కోసమే ఏ ప్రభుత్వ పథకాలైన ఉంటాయని.. అలాంటి అన్నదాతలే పంట పండించలేమని తేల్చి చెబుతున్నారు అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు
అల్లవరం, ఐ.పోలవరం, ముమ్మిడివరం, ఉప్పలగుప్తం మండలాల్లో 25 వేల ఎకరాలు, అలాగే అమలాపురం రూరల్, మామిడికుదురు, కాట్రేనికోన, సఖినేటిపల్లి మండలాల్లో 20 వేల ఎకరాలు, కడియం మండలంలో కూడా కొన్ని వందల ఎకరాల్లో రైతులు పంట విరామం ప్రకటించారన్నారు. దాదాపు 50 వేల ఎకరాలకు పైగా పంట విరామం ప్రకటించడం చూస్తుంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థమవుతోందన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్లిప్తత వల్లే విధిలేని పరిస్థితుల్లో రైతుల పంటవిరామ నిర్ణయం తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటవిరామంపై వైకాపా నేతలవి చౌకబారు విమర్శలు తగవని.. రాజకీయాలు మాని సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: