Paddy Seed Problems: గుంటూరు జిల్లాలో నకిలి వరి విత్తనాలతో మోసపోయామని రైతులు పోలీసుల్ని ఆశ్రయించారు. బాపట్ల మండలం మర్రిపూడి, పొన్నూరు మండలం చిన ఐటికంపాడు, నండూరు గ్రామాలకు చెందిన పలువురు రైతులు.. బాపట్ల గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 'కల్లూరి సుబ్బారావు అనే వ్యాపారి వద్ద ఎంటీయూ 1224 రకం వరి విత్తనాలు కొనుగోలు చేశాం. 150రోజులకు పంట వస్తుందని చెప్పారు. అయితే 90 రోజులకే పంట కంకి వచ్చింది. అదే సమయంలో వర్షాలు రావటంతో పంట నేలకొరిగింది. కనీసం బస్తా కూడా రైతు చేతికి రాకుండా పూర్తిగా పాడైపోయింది' అని రైతులు వాపోయారు.
25కిలోల విత్తనానికి 980 రూపాయల చొప్పున చెల్లించారు. కేవలం సుబ్బారావు అనే వ్యాపారి వద్ద విత్తనాలు కొన్నవారు 250 ఎకరాల్లో సాగు చేశారు. వారందరి పంటా పాడైపోవటంతో వ్యాపారిని కలిసి పరిస్థితి వివరించారు. తాను నంద్యాల నుంచి విత్తనాలు తెప్పించినట్లు సదరు వ్యాపారి తెలిపారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ రైతులు బాపట్ల గ్రామీణ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేస్తామన్నారు.
ఇదీ చదవండి..
Jagan assets case: "ప్రజాప్రయోజనాల కోసం.. హాజరు నుంచి మినహాయింపు ఇవ్వండి"