రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని... రాజకీయ కక్షతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ధ్వజమెత్తారు. తెదేపా నేతలు అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకరరెడ్డి, చింతమనేని ప్రభాకర్ల అరెస్టులను ఖండించిన జయదేవ్... తక్షణమే వారిని ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
లక్షల కోట్ల అవినీతికి పాల్పడి, కేసుల్లో ఏ1, ఏ2 నిందితులుగా ఉన్న వైకాపా నేతలు తెదేపాపై ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రంలో పాలన రాజ్యాంగబద్ధంగా జరగడంలేదు. కోర్టుల తీర్పులే అందుకు నిదర్శనం. 60 సార్లు ప్రభుత్వ నిర్ణయాలను కోర్టులు తప్పుబట్టాయి. ప్రభుత్వంపై విమర్శలు చేస్తే... పోలీసులను అడ్డుపెట్టుకుని వేధిస్తున్నారు. రాష్ట్రం పోలీసు రాజ్యంలా మారిపోయింది. వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీలో ప్రశ్నిస్తారనే తెదేపా నేతలను అరెస్టు చేస్తున్నారు.
---- గల్లా జయదేవ్, తెదేపా ఎంపీ
తెదేపా నేతల అరెస్టులను నిరసిస్తూ...గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాగడాల ప్రదర్శన చేశారు. రానున్న శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వ అవినీతిని ఎండగడతారనే భయంతోనే ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారని ఎంపీ జయదేవ్ ఆరోపించారు. లాక్డౌన్ వల్లే హైదరాబాద్లో ఉండిపోవాల్సి వచ్చిందన్న ఆయన... ఎలాంటి ఊహాగానాలకు తావులేదని స్పష్టత ఇచ్చారు. తెలుగదేశం పార్టీని వీడే ప్రశ్నే లేదన్నారు.
ఇదీ చదవండి : తెదేపా నేతల అరెస్టులపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు