ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా ప్రభావం... రాష్ట్రంలో ప్రముఖ వాణిజ్య పంట మిర్చిపైనా పడింది. మిరప ధర తగ్గుముఖం పట్టేలా చేసింది. గుంటూరు మార్కెట్ యార్డుకు వచ్చే సరుకు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాలకు సైతం ఎగుమతి అవుతుంది. పల్నాడు ప్రాంతంలో పండే... తేజరకం మిర్చికి చైనాలో మంచి గిరాకీ ఉంది. మంచిరంగుతో పాటు ఘాటు ఎక్కువగా ఉండటంతో ఇక్కడ మిర్చికి ఆదరణ ఉంది.
కొన్నేళ్లుగా ఎగుమతులు సజావుగా సాగుతున్నా... కరోనా ప్రభావంతో నిలిచిపోయాయి. దీనివల్ల మేలు రకం కాయలు కూడా క్వింటాకు 13 వేల 500 రూపాయల లోపే ధర ఉంది. ఇవి కూలీ ఖర్చులకు కూడా సరిపోవటం లేదని కర్షకులు వాపోయారు.
రెండు నెలలుగా ధర పతనం
మిర్చి ధర రెండు నెలలుగా క్వింటాకు 8 వేల రూపాయల మేర పతనమైంది. ఎగుమతుల్లో ఏర్పడిన ప్రతిష్టంభన కారణంగా ధరలు ఇంతలా పడిపోయినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కరోనా దెబ్బకు చైనాలోని వ్యాపార వర్గాలు లావాదేవీలకు విరామం ఇచ్చారు. దీని వల్ల ఇక్కడి నుంచి ఎగుమతులు నిలిచి పోయాయి. ధరలు తగ్గిపోవటంతో రైతులు సరుకు నిల్వ చేసుకునేందుకు శీతలగిడ్డంగులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటి వరకూ 40 లక్షల బస్తాలు శీతల గిడ్డంగులకు వచ్చాయి.
ప్రభుత్వమే ఆదుకోవాలి
గుంటూరు జిల్లాలో దాదాపు 100కు పైగా శీతల గిడ్డంగులు ఉండగా... వాటిలో సగంపైగా నిండిపోయాయి. కరోనా ప్రభావం ఎంతలేదన్నా.. మరో రెండు, మూడు నెలలు ఉండే అవకాశం కనిపిస్తోంది. వైరస్ ప్రభావం తగ్గినా ఆర్థిక పరిస్థితులు ఏ మేరకు ఉంటాయో తెలియదు. ఇలాంటి సమయంలో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: