రైతుల కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. గుంటూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. వరదలతో పంటలు కోల్పోయిన రైతులకు ధైర్యం చెప్పారు. సాగునీటి మోటార్లకు మీటర్లు బిగించటాన్ని తమ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదన్నారు. రైతుల తరఫున తెదేపా పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు.
రైతు రాజ్యం తెస్తామని పాదయాత్రలో చెప్పిన జగన్ ఇప్పుడు రైతు లేని రాజ్యం తెస్తున్నారని ఎద్దేవా చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరదలు వస్తే కనీసం సహాయ చర్యలు లేవని ఆరోపించారు. ప్రభుత్వ యంత్రాంగం కనీసం స్పందించడం లేదని విమర్శించారు. వరద వస్తుందని తెలిసినా ముఖ్యమంత్రి కనీసం సమీక్ష చేయలేదని.. ప్రధాని ఫోన్ చేసిన తర్వాతే ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారని చెప్పారు. అసెంబ్లీలో నోరు చించుకుని మాట్లాడే మంత్రులు ఇక్కడకు వచ్చి వాస్తవాలు చూడాలని.. రైతుల ఇబ్బందులను పరిశీలించాలని సూచించారు. అడుగడుగునా రైతులను అవమానించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. రైతులు టీషర్ట్లు, సెల్ఫోన్లు వాడకూడదా అని ప్రశ్నించారు. ఉచిత విద్యుత్ ఎత్తి వేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని... అందుకే మీటర్లు పెట్టాలని చూస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ గట్టిగా పోరాడుతుందని తెలిపారు.
ముఖ్యమంత్రి ఎందుకు బయటకు రావటం లేదని.. వరద ప్రాంతాల్లో ఎందుకు పర్యటించటం లేదని ప్రశ్నించారు. గతేడాది వరద పరిహారం ఇంకా ఇవ్వలేదని లోకేష్ ఆరోపించారు. రాష్ట్రంలో మొత్తం కలిపి 25 లక్షల రూపాయలు పరిహారం ఇస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి:
వీడని వరద భయం... లంక గ్రామాలు విలవిల