అగ్రిగోల్డ్ సంస్థకు చెందినవిగా పేర్కొంటూ పలువురి ఆస్తులను జప్తు చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జారీచేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులను ఖరారు చేసే నిమిత్తం జరుపుతున్న విచారణను.. ఈ నెల 31 వరకు ఆపాలని మనీలాండరింగ్ అడ్డ్యుడికేటింగ్ ఆథారిటీకి హైకోర్టు స్పష్టంచేసింది. విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.
అగ్రిగోల్డ్ సంస్థలపై కేసులు నమోదు చేయడానికి ముందే అపార్ట్మెంట్ ప్లాట్లు కొనుగోలు చేశామని.. ఆ ప్లాట్లను జప్తు చేస్తూ ఈడీ ఇచ్చిన ప్రాథమిక అటాచ్మెంట్ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ఫార్చూన్ హేలాపురి అపార్ట్ మెంట్ యాజమాన్యాల సంఘం హైకోర్టులో పిటిషన్ వేసింది. 2015కు పూర్వమే ప్లాట్లు కొనుగోలు చేశామని పేర్కొంది. న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్లాట్లను జప్తు చేయడానికి వీల్లేదన్నారు. ఈడీ జప్తు చేస్తూ ఇచ్చిన ప్రాథమిక అటాచ్ మెంట్ ఉత్తర్వులను ఖరారు చేసే నిమిత్తం అడ్డ్యుడికేటింగ్ అథారిటీ విచారణ జరుపుతోందన్నారు. ఆ ప్రక్రియను నిలువరించాలని అభ్యర్థించారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఈ నెల 31 వరకు విచారణను వాయిదా వేయాలని ఈడీ అడ్యుడికేటింగ్ అథారిటీని ఆదేశించారు.
ఇదీ చదవండి:
SP Reaction: వివేకా కుమార్తె లేఖకు ఎస్పీ స్పందన.. సునీత ఇంటి వద్ద పికెట్ ఏర్పాటు!