Heavy Traffic in around Nagarjuna University: గుంటూరులో వైకాపా ప్లీనరీ సందర్భంగా నాగార్జున యూనివర్శిటీ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. లారీలు, భారీ వాహనాలను పోలీసులు ముందుగానే దారి మళ్లించినప్పటికీ.. ఇతర వాహనాలు ఎక్కువ సంఖ్యలో రాడంతో ఇబ్బందులు తప్పలేదు. ప్లీనరీకి విజయవాడ వైపు నుంచి వచ్చిన వాహనాలకు కాజ టోల్ ప్లాజా పక్కన ఉన్న రామకృష్ణ వెనుజియ, నాగార్జున యూనివర్శిటీలో పార్కింగ్ సౌకర్యం కల్పించారు. ఆ వాహనాల్లో వచ్చిన వారు అండర్ పాస్ నుంచి కాకుండా టోల్‌ప్లాజా వద్ద జాతీయ రహదారిని దాటి ప్లీనరీకి వెళ్లేందుకు వెసులుబాటు కల్పించారు. ఈ క్రమంలో హైవేపై వచ్చే వాహనాలను ఆపి మరీ వైకాపా శ్రేణులను రోడ్డు దాటిస్తున్నారు పోలీసులు. ఇలా తరచుగా చేయడంతో జాతీయ రహదారిపై వెళ్లే వాహనదారులు అసౌకర్యానికి గురయ్యారు.
దానికి తోడు ప్లీనరీకి వచ్చిన కొందరు.. తమ వాహనాలను జాతీయ రహదారిపైనే పార్కింగ్ చేశారు. దాదాపు 20 చోట్ల పార్కింగ్ సౌకర్యం ఉన్నప్పటికీ ప్రధాన రహదారిపైనే వాహనాలు వదిలి వెళ్లారు. వేలాది మంది పోలీసులు ప్లీనరీ విధుల్లో ఉన్నా.. హైవేపై పార్కింగ్ వాహనాలను నిలువరించలేకపోయారు. మరికొందరు నాయకులు జాతీయ రహదారి పక్కన ఉన్న సర్వీసు రోడ్డులోనూ వాహనాలను పార్కు చేశారు.
యూనివర్శిటీ నుంచి తాడేపల్లి వరకు నిలిపివేత: ముఖ్యమంత్రి తాడేపల్లి నుంచి ప్లీనరీకి వచ్చే సమయంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి తాడేపల్లి వరకు జాతీయ రహదారిపై మొత్తం వాహనాలను నిలిపివేశారు. ఆ సమయంలోనూ వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు. ముఖ్యమంత్రి హెలికాప్టర్లో సభాస్థలికి వస్తారని ముందుగా ప్రకటించారు. అయితే వాతావరణం సరిగా లేని కారణంగా రోడ్డు మార్గంలోనే ప్లీనరీకి హాజరయ్యారు.
ఇదీ చదవండి: