తెదేపా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ను ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. సంగం డెయిరీ ఛైర్మన్‌గా పలు ఆర్థిక, పరిపాలనాపరమైన అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై నమోదు చేసిన కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం వేకువజామునుంచి సాయంత్రం వరకూ పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నరేంద్ర స్వగ్రామమైన గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడిలో ఉదయం ఆరున్నర సమయంలో అరెస్టు చేసినట్లు ప్రకటించి ఆయన భార్య జ్యోతిర్మయికి నోటీసును ఇచ్చారు. నరేంద్రను అక్కడినుంచి విజయవాడ ఏసీబీ కార్యాలయానికి ఉదయం 9.30కు తీసుకొచ్చారు. మధ్యాహ్నం 3.30 వరకూ అక్కడే ఉంచారు. అనంతరం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. సాయంత్రం 5.30కు విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఇదే కేసులో నరేంద్రతోపాటు డెయిరీ ఎండీ పి.గోపాలకృష్ణన్, లోగడ గుంటూరు జిల్లా సహకార అధికారిగా పనిచేసిన ఎం.గురునాథాన్ని అరెస్టు చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించాక గురునాథానికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావటంతో ఆయన్ను ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. నరేంద్ర, గోపాలకృష్ణన్‌లను ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరచగా మే 6 వరకూ రిమాండ్‌కు పంపుతూ రాత్రి 12.45 ప్రాంతంలో ఆదేశాలిచ్చింది.
300 మందితో గ్రామాన్ని చుట్టుముట్టి..
చింతలపూడి గ్రామానికి వేకువజామున 4గంటలనుంచే భారీగా భద్రతా బలగాలు చేరుకున్నాయి. 300 మంది వరకు పోలీసులు నరేంద్ర ఇంటిని, పరిసరాలను దిగ్బంధించారు. ఉదయం 6.30కు ఏసీబీ అధికారులు ఆయన ఇంటి ప్రాంగణంలోకి ప్రవేశించి సెక్యూరిటీ గార్డు వద్దనున్న సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మఫ్టీలో ఉన్న మహిళా పోలీసులు ఇంటి కాలింగ్‌బెల్ కొట్టగా నరేంద్ర సతీమణి జ్యోతిర్మయి తలుపు తీశారు. ఏసీబీ అధికారులు, పోలీసులు లోపలకు ప్రవేశించారు. అప్పటికే నిద్రలేచిన నరేంద్ర కాలకృత్యాలు తీర్చుకోవడానికి మూత్రశాలకు వెళ్లగా, పోలీసులు ఆ గది తలుపు తట్టారు. ఆయన బయటకొచ్చిన వెంటనే అరెస్టు చేస్తున్నామని తెలిపారు. అంతా అరగంటలోనే..: ఉదయం ఆరున్నరకు నరేంద్ర ఇంటికి వెళ్లిన ఏసీబీ అధికారులు ఆయన్ను ఏడింటికల్లా గ్రామంనుంచి తరలించారు. కొందరు వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు లాగేశారు. అంతకుముందు న్యాయవాది వి.లీలాప్రసాద్ ఇంటి లోపలికి వెళ్లేందుకు అనుమతి కోరినా ఏసీబీ అధికారులు అంగీకరించలేదు. కర్లపాలెం, చెరుకుపల్లి మార్గంలో విజయవాడ ఏసీబీ కార్యాలయానికి తరలించారు. అటువైపు బారికేడ్లు ఏర్పాటుచేసి లోపలికి వెళ్లిన ప్రతి ఒక్కరినీ ప్రశ్నించారు. తెదేపా శ్రేణులు ఏసీబీ కార్యాలయమున్న వీధి వద్దకు చేరుకొని నరేంద్ర అరెస్టును నిరసిస్తూ నినదించారు. ఏసీబీ కార్యాలయం నుంచి వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో మాజీ మంత్రి దేవినేని ఉమా అక్కడికి చేరుకుని వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. తెదేపా కార్యకర్తలు బాపట్ల-గుంటూరు రహదారిపై రాస్తారోకో చేశారు.
నోటీసు తప్పులతడక: నరేంద్ర కుమార్తె వైదీప్తి
నరేంద్రను అరెస్టు చేస్తున్నట్లు ఏసీబీ ఇచ్చిన నోటీసు చివరి భాగంలో ఆయన పేరు బదులు ఎం.గురునాథం అని ఉంది. దీన్ని గుర్తించిన ఏసీబీ అధికారులు తప్పును సవరించి నరేంద్ర పేరును చేర్చి మధ్యాహ్నం మూడింటికి మరో నోటీసునిచ్చారు. తప్పులతడకగా ఎలా నోటీసు ఇస్తారని నరేంద్ర కుమార్తె వైదీప్తి ప్రశ్నించటంతో పొరపాటు జరిగిందని అధికారులు అంగీకరించారు. ఈ సందర్భంగా ఏసీబీ విడుదల చేసిన ప్రకటన ఇలా ఉంది. ‘ధూళిపాళ్ల నరేంద్ర ఛైర్మన్‌గా ఉన్న సంగం డెయిరీలో అక్రమాలకు సంబంధించి లభించిన ఆధారాలనుబట్టి కేసు నమోదు చేశాం. ఛైర్మన్ నరేంద్ర, ఎండీ పి.గోపాలకృష్ణన్, గుంటూరు జిల్లా సహకార శాఖ మాజీ అధికారి ఎం.గురునాథంను అరెస్టు చేశాం. నరేంద్ర ప్రభుత్వ ఆస్తులను వ్యక్తిగత అవసరాలకు వినియోగించారు. ఇతర నేరాలకు పాల్పడ్డారు’ అని ఏసీబీ పేర్కొంది. ‘అవినీతి నిరోధక చట్టంలోని 13(1)(సీ)(డీ), ఐపీసీలోని 408, 409, 418, 420, 465, 471, 120బీ రెడ్‌విత్ 34 సెక్షన్ల కింద నరేంద్రకుమార్‌ను అరెస్టు చేశాం. ఇది బెయిల్‌కు వీల్లేని కేసు. కోర్టు ద్వారానే బెయిల్ పొందాలి’ అని నరేంద్ర సతీమణికిచ్చిన నోటీసులో పేర్కొన్నారు.
అంతా పారదర్శకమే: డెయిరీలో ఎలాంటి అవకతవకలు లేవు. సీఎం జగన్ కక్ష సాధింపునకు పాల్పడుతున్నారు. పాడి రైతుల సంక్షేమానికి సంగం డెయిరీ ఎనలేని కృషి చేస్తోంది. ప్రతి పైసాకు లెక్క ఉంది.
ఇదీ చదవండి: