జై అమరావతి నినాదాలతో గుంటూరు జిల్లాలోని తెనాలి ప్రాంతం మార్మోగింది. అమరావతి పరిరక్షణ కోసం స్థానిక వీఎస్ఆర్ కళాశాల మైదానంలో ఐకాస నిర్వహించిన బహిరంగసభకు పెద్దఎత్తున జనం హాజరయ్యారు. ఐకాస నేతలతో సహా సభావేదికకు బయల్దేరిన చంద్రబాబుకు ఆయా గ్రామాల్లో ప్రజలు ఎక్కడికక్కడ ఘనస్వాగతం పలికారు. తెనాలిలో ఇటీవల వైకాపా శ్రేణులు తగలబెట్టిన ఐకాస దీక్షా శిబిరాన్ని చంద్రబాబు సందర్శించారు. అక్కడకు వెళ్లేందుకు వీల్లేకుండా బారికేడ్లు పెట్టినందున కాసేపు రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం సభా వేదికకు చేరుకున్న చంద్రబాబు.. అమరావతిలో ఇప్పటివరకూ చోటుచేసుకున్న 37 మరణాలు ప్రభుత్వ హత్యలుగా అభివర్ణించారు. జగన్ తగిన మూల్యం చెల్లించే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. అంతకుముందు తమ బిడ్డల భవిష్యత్తు అంధకారమైపోతోందంటూ రాజధానికి చెందిన ఓ మహిళ సభావేదికపై కన్నీటిపర్యంతమయ్యారు.
ఆదాయం తగ్గిపోతున్నా...పట్టదా..
9 నెలల కాలంలో రూ.11 వేల కోట్ల ఆదాయం తగ్గిపోయిందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. 3 రాజధానులను జాతీయస్థాయి మీడియా సంస్థలన్నీ ఎండగడుతున్నా జగన్‌కు జ్ఞానోదయం కావడం లేదని మండిపడ్డారు.
ప్రభుత్వానికి సవాల్
తాను స్వార్థపూరితంగా వ్యవహరించినట్లైతే తిరుపతిలో రాజధాని పెట్టేవాడినని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి, 3 రాజధానుల ప్రతిపాదనలపై రెఫరెండం నిర్వహించాలని ప్రభుత్వానికి సవాల్ చేశారు.
నవ్వులపాలయ్యే స్థితి తెచ్చారు
దక్షిణ భారతదేశంలో ఒకప్పుడు ఇతర రాష్ట్రాల కంటే ముందుండేందుకు పోటీపడిన రాష్ట్రం ఇప్పుడు నవ్వులపాలయ్యే స్థితికి చేరుకుందని నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీలకు సన్మానం
రాజధాని వికేంద్రీకరణ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపటంలో ప్రలోభాలకు లొంగకుండా వ్యవహరించిన ఎమ్మెల్సీలకు సభావేదికపై పౌర సన్మానం నిర్వహించారు.