రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నా బ్లాక్ ఫంగస్ వెంటాతూనే ఉంది. బ్లాక్‌ఫంగస్ కేసులు, మరణాలు గుంటూరు జిల్లాను హడలెత్తిస్తున్నాయి. కేవలం నెల రోజుల్లోనే జిల్లాలో 500కి పైగా కేసులు నమోదయ్యాయి. వారిలో 162 మంది కోలుకోగా 70 మంది మరణించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 200 మంది, ఇతర ఆసుపత్రుల్లో మరో 60 నుంచి 70 మంది చికిత్స పొందుతున్నారు. బ్లాక్‌ఫంగస్ లక్షణాలు తొలుత ముక్కు నుంచి ప్రారంభమై క్రమంగా కన్ను, మెదడుకు వ్యాపించడంతో మరణిస్తున్నారు.
మరికొందరికి పంటి సమస్యతో మొదలై దవడ తీసేసే పరిస్థితి ఏర్పడుతోంది. కరోనా రోగుల్లో మధుమేహం ఉన్నవారితో పాటు చికిత్స సమయంలో స్టెరాయిడ్స్ ఎక్కువగా ఉపయోగించిన వారికి సోకుతున్నట్లు వైద్యులు గుర్తించారు. బ్లాక్‌ఫంగస్‌ని ఆరంభంలోనే గుర్తించడం ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించకుండా ఆపి వ్యాధిని తగ్గించవచ్చని నిపుణులు చెప్తున్నారు. బ్లాక్‌ఫంగస్ చికిత్సలో ఉపయోగిస్తున్న ఆంపోటెరాసిన్-బీ ఇంజక్షన్ల కొరత వేధిస్తుంది.
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మూడో వంతు రోగులకు కూడా ఆంపోటెరాసిన్ ఇంజక్షన్లు ఇవ్వడం లేదు. ప్రత్యామ్నాయంగా వేరే మందులు అందిస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక ధర వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పది రోజుల కిందటి వరకూ బ్లాక్‌ఫంగస్ మందుల కొరత ఉండేదని కానీ ప్రస్తుతం మందుల కొరత లేదని ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీఎంహెచ్ఓ యాస్మిన్ చెబుతున్నారు. బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం సరిపడా మందుల సరఫరా చేయాలని బాధితులు, వారి కుటుంబసభ్యులు కోరుతున్నారు.
ఇవీ చదవండి:
Vaccination Sunday: నేడు మెగా వ్యాక్సినేషన్.. 10 లక్షల టీకా డోసులు