ఆలయ ఆస్తుల పరిరక్షణకు డిమాండ్ చేస్తూ గుంటూరులోని తన నివాసంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఉపావాస దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... హిందూ ఆలయాల జోలికి రావద్దని చాలా సార్లు చెప్పినా.. ప్రభుత్వం ముందుకెళ్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి, అన్నవరం ఆలయ భూములు తీసుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. భాజపా ఆందోళనతో మంగళగిరి, అన్నవరం ఆలయ భూములపై వెనక్కి తగ్గారని అన్నారు.
ఇప్పుడు ఏకంగా తిరుమల వెంకన్న భూములకే ఎసరు పెట్టారని కన్నా దుయ్యబట్టారు. ధార్మిక సంస్థలు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయని తెలిపారు. తితిదే ఛైర్మన్ మాత్రం భూముల అమ్మకానికి కేవలం రోడ్ మ్యాప్ ఇచ్చామన్నారని... ఇదే సుబ్బారెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆలయ భూముల రక్షణపై చాలా మాట్లాడారని గుర్తు చేశారు.
తాము రద్దు చేయమన్నది ఒక జీవో అయితే... ప్రభుత్వం చేసింది మరో జీవో అంటూ మండిపడ్డారు. దేవుడిని కూడా మోసం చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చిందని కన్నా ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి వచ్చాక చేసిన ప్రతి పని ప్రజలను మోసం చేసేదే అని ఆక్షేపించారు. ప్రభుత్వం తితిదే భూముల అమ్మకానికి వ్యతిరేకంకాదని మాకు అర్థమవుతోందని అన్నారు. కేవలం ప్రజలను మభ్య పెట్టేందుకే నిన్న జీవో ఇచ్చారని వివరించారు.
ఇదీ చదవండి: