ఆర్టీసీ ప్రయాణికులకు ఆన్లైన్ రిజర్వేషన్ తప్పనిసరి చేశారు అధికారులు. నగదు రహితంగా టికెట్లు ఇవ్వటానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఆన్లైన్ టిక్కెట్ల బుకింగ్‌పై అవగాహనలేక చాలా మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాత విధానంలో టికెట్ల కోసం బస్స్టేషన్లలో విచారణ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఎక్కువ మందికి అవగాహన లేనందున మరి కొంతకాలం పాత పద్ధతిలో టికెట్లు ఇవ్వాలని కోరుతున్నారు.
ప్రయాణికులు లేక బస్సులు బోసిపోతున్నాయి. ఒకరిద్దరు ప్రయాణికులతో బస్సులు నడుపుతున్నారు. గుంటూరు నుంచి మంగళగిరి, తెనాలి లాంటి ముఖ్యమైన దారుల్లోనూ కేవలం ఒకరిద్దరు ప్రయాణికులే ఉంటున్నారు. ఒక్కరి కోసం బస్సు నడపటంపై అధికారులు తొలుత సందేహించినా... సమయానికి వెళ్లాలి కాబట్టి, తిరిగి అక్కడి నుంచి బుకింగ్స్ ఉంటాయన్న ఆలోచనతో సమయానుకూలంగా నడపక తప్పని పరిస్థితి ఏర్పడింది.
12 డిపోల్లో 82 సర్వీసులు
గుంటూరు జిల్లాలో ఆర్టీసీ బస్సు సర్వీసులు 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. జిల్లాలోని మొత్తం 13 డిపోల్లో నరసరావుపేట మినహా మిగతా 12 డిపోల నుంచి బస్సులు నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. గుంటూరు సహా పలు డిపోల నుంచి 82 బస్సు సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి . కరోనా వ్యాప్తి వల్ల ప్రయాణికులు భౌతికదూరం పాటించేలా ఆర్టీసీ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బస్సులు మార్గమధ్యంలో ఎక్కడా ఆపకుండా.. డిపోల నుంచి డిపోలకు మాత్రమే సర్వీసులు నడుపుతున్నారు.
ఆన్లైన్ రిజర్వేషన్‌పై అవగాహన
జిల్లా పరిధిలోనే ప్రస్తుతం సర్వీసులు తిప్పుతున్నామని.. అంతర్ జిల్లా సర్వీసులను నడపడం లేదని చెప్పారు. స్పాట్ బుకింగ్ లేకపోవడం కూడా ప్రయాణికుల సంఖ్య తగ్గడానికి ఓ కారణమని అధికారులు చెబుతున్నారు. అప్రమత్తమైన అధికారులు.. ఆన్లైన్ టిక్కెట్ రిజర్వేరేషన్పై అవగాహన కల్పిస్తూ .. టిక్కెట్లు ఎలా తీసుకోవాలో వివరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లు, ఏటీఎం కార్డులు లేకపోయినా.. సిబ్బంది సొంత మొబైల్‌లలో రిజర్వేషన్ చేసి ప్రయాణికులు సాయం చేస్తున్నారు. క్రెడిట్, డెబిట్ కార్డులు, గూగుల్ పే లాంటి అన్ని రకాల వ్యాలెట్ల ద్వారా టికెట్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని ప్రయాణికులకు వివరిస్తున్నారు.
ఆన్లైన్లో టికెట్లు బుక్ చేయటంపై క్షేత్ర స్థాయిలో మరింతగా ప్రచారం, అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. తగినంత మంది ప్రయాణికులు లేకుండా బస్సులు నడవటం వల్ల.. ఆర్టీసీ ఊహించని నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. జిల్లాలో మొత్తం వెయ్యి బస్సులుండగా.. ప్రస్తుతం ఇందులో పదోవంతు మాత్రమే రోడ్డు మీదకు వచ్చాయి. టికెట్ బుకింగ్‌పై అవగాహన కల్పిస్తే... ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: