గుంటూరు జిల్లా నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు మంగళవారం కొరిటపాడులోని వైకుంఠధామం శ్మశాన వాటికను, పాత గుంటూరులోని శ్మశాన వాటికలను పరిశీలించారు. శ్మశానవాటికల్లో అంత్యక్రియల నిర్వహణ వివరాలను స్థానికులను అడిగి తెలుసుకొన్నారు. కొవిడ్ వచ్చిన వారిలో అధిక శాతం మంది కోలుకుంటున్నారని, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మృతి చెందుతున్నారని మేయర్ అన్నారు.
గుంటూరు నగరం జిల్లా కేంద్రం అయినందున, జిల్లా నుంచే కాక ఇతర జిల్లాల నుంచి కూడా రోగులు మెరుగైన వైద్యం కోసం గుంటూరు నగరానికి వస్తున్నారు. వారిలో కొవిడ్ వలన కాని ఇతర కారణాలతో చనిపోయిన వారిని కొంతమందిని నగరంలోని శ్మశానవాటికల్లో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారని అన్నారు. అంతిమ సంస్కారాలు నిర్వహణకు అధిక మొత్తంలో డబ్బులు వసూళ్లు చేస్తునారని నగరపాలక సంస్థకి పలువురు ఫిర్యాదులు అందాయన్నారు. ఈ క్రమంలో నేటి నుంచి నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఉన్న 7 హిందూ శ్మశాన వాటికలు, 2 క్రిస్టియన్ శ్మశాన వాటికలు, 1 ముస్లిం శ్మశాన వాటికలో ఉచితంగా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నామన్నారు.
నగరంలోని శ్మశాన వాటికల్లో ప్రజల అవగాహన కోసం.. ఉచిత అంత్యక్రియల సూచిక బోర్డులను ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా డబ్బులు అడిగితే నగర పాలక సంస్థ నందు ఏర్పాటు చేసిన ప్రత్యేక కాల్ సెంటర్లో ఫిర్యాదు చేయాలన్నారు. ఇప్పటికే ప్రతి చోట నగర పాలక సంస్థ సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. నగరంలోని శ్మశాన వాటికలలో దహన సంస్కారాలకు ఎటువంటి రుసుము వసూలు చేయకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఎవరైనా డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిసినట్లయితే చర్యలు తప్పవన్నారు. దహన సంస్కారాలకు ఎటువంటి డబ్బులు వసూలు చేయకూడదనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.
ఇదీ చదవండి: నాలుగున్నర గంటల ఆలస్యం...గాల్లో కలిసిన 11 ప్రాణాలు !