Budget Allocations For 'Ada-Bidda Nidhi' Scheme : గతి తప్పిన రాష్ట్రానికి రాచబాట వేస్తూ సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా అడుగులు వేస్తూ వాస్తవిక పద్దును కూటమి ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకొచ్చింది . సంక్షేమానికి, ప్రాధాన్య రంగాలకు అగ్రతాంబూలం వేస్తూనే బడ్జెట్‌కు ప్రాణాధారమైన మూలధన వ్యయాన్ని అమాంతం పెంచింది. ప్రజల ఆశలు, ఆకాంక్షలను తీరుస్తూనే పదింతల ప్రగతి సాధించాలనే సమున్నత సంకల్పంతో రాష్ట్ర పునర్నిర్మాణమే ధ్యేయంగా రూ 3 లక్షల కోట్లకు చేరువగా ప్రతిపాదించిన బడ్జెట్ నవ్యాంధ్ర భవిష్యత్తుకు, స్వర్ణాంధ్ర స్వప్నం సాకారానికి పటిష్ట పునాదులు వేసేలా ఉంది.
సూపర్‌సిక్స్ పథకాల అమల్లో భాగంగా మరో కీలక హామీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ (AP Budget)లో నిధులు కేటాయించింది. 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు నెలకు పదహేను వందల (రూ.1,500) చొప్పున ఆర్థికసాయం అందిస్తామని కూటమి పార్టీలు ఎన్నికల ప్రచారంలో ప్రకటించాయి.
ఈ పథకానికి అప్పట్లో ఆడబిడ్డ నిధి లేదా మహిళాశక్తిగా నామకరణం చేశారు. ఇప్పుడు ‘మహిళలకు ఆర్థిక సహకారం’ పేరుతో ఆయా వర్గాలకు చెందిన వారికి 2024-25 బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.3,341.82 కోట్లు కేటాయించింది. బీసీ మహిళలకు రూ.1099.78 కోట్లు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రూ.629.37 కోట్లు, మైనారిటీలకు రూ.83.79 కోట్లు, ఎస్సీ మహిళలకు రూ.1198.42 కోట్లు, గిరిజన మహిళలకు రూ.330.10 కోట్లు ప్రతిపాదించింది. జెండర్ బడ్జెట్‌లో ఈ నిధుల్ని ప్రత్యేకంగా చూపించింది.
దీపం-2.0 భారీ బుకింగ్‌లు- ఒక్కరోజే అన్నివేలా!
సూపర్-6 హామీల్లో ఒకటైన "అన్నదాత సుఖీభవ"కు వెయ్యి కోట్ల కేటాయింపులు చేసింది. దీనికి పీఎం-కిసాన్ యోజన తోడ్పాటు ఉండనే ఉంది. సంక్షేమానికి పెద్ద పీట వేసిన ప్రభుత్వం మ్యానిఫెస్టోలో ప్రకటించిన తల్లికి వందనం పథకానికి 6వేల487 కోట్లు కేటాయించింది. ప్రతి మహిళకు నెలకు 1500 ఇస్తామన్న హామీ అమలుకు రూ.3341కోట్లు కేటాయించింది. డ్వాక్రా మహిళలకు సున్నావడ్డీ పథకాన్ని 10 లక్షల వరకూ అమలు చేస్తామన్న హామీ మేరకు 12వందల 50 కోట్లు కేటాయించింది. పేదల గృహ నిర్మాణానికి 4వేల12 కోట్లు ఇచ్చింది. టిడ్కో ఇళ్లకు వెయ్యి 89కోట్లు కేటాయించారు. ఇక మేలైన కేటాయింపులతో ఉద్యానం, మత్స్య రంగం, పాడి పరిశ్రమాభివృద్ధికి కంకణం కట్టుకుంది.