An exercise teacher instructing archery : మానసిక ఉల్లాసాన్ని కలిగించడంతో పాటు శారీరకంగా దృఢంగా ఉండేలా చేయడంలో క్రీడలది ప్రధానపాత్ర. ఇందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేందుకు ఎన్నో క్రీడలు ఉన్నాయి. ఐతే విలువిద్యనే శ్వాసగా జీవిస్తూ... దానిని పదిమందికీ నేర్పించడంతో పాటు ఈ క్రీడకు మంచి గుర్తింపు తీసుకొవచ్చేందుకు కృషి చేస్తున్నాడు ఓ మాస్టారు.
గురువు లేకండా విద్య నేర్చుకున్నాడు ఆ ఉపాధ్యాయుడు. తనకు వచ్చిన విద్యను పదిమందికి నేర్పుతున్నాడు. విలువిద్య నేర్పుతూ... ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. తన శిష్యులను ఒలింపిక్స్‌లో చూడాలన్న తన కలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు ఆ మాస్టారు. విల్లు పట్టి విద్యార్థులకు విలువిద్యలో మెళకువలు నేర్పించే ఈ మాస్టారి పేరు జయరాజు. వృత్తిరీత్యా వ్యాయామ ఉపాధ్యాయుడు. ఈయన ప్రవృత్తి మాత్రం విలువిద్యే.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన ఈ మాస్టారు చిన్ననాటి నుంచే ఈ విద్యపై మక్కువ పెంచుకున్నారు. తొలినాళ్లలో కొండ ప్రాంతాల్లో స్నేహితులతో తిరుగుతూ.. గిరిజనుల వద్ద నుంచి విల్లులు తెచ్చుకుని ఈ విద్యను ఆరంభించారు. అలా పెరిగేకొద్దీ. ఈ ఆటపై ఆయనకు మరింత ఇష్టం పెరిగింది. ఆ ఇష్టమే ప్రస్తుతం పలువురికి విలువిద్యలో శిక్షణ ఇచ్చేలా మాస్టారుని ప్రేరేపించింది.
ఒలింపిక్స్‌లో పాల్గొని ఆర్చరీలో బంగారు పతకం సాధించడమే లక్ష్యంగా:
పదిహేనేళ్ల నుంచి ఆసక్తి ఉన్న విద్యార్థులకు జయరాజు మాస్టారు ఆర్చరీ నేర్పుతున్నారు. విజయవాడలోని ఓల్గా ఆర్చరీ అకాడమీకి అనుబంధంగా నడిచే ఈ అకాడమీలో ప్రస్తుతం 35 మంది విద్యార్థులు విలువిద్యను నేర్చుకుంటున్నారు. ఆదివారాలు, సెలవు దినాల్లో విద్యార్థులు ఎక్కువ మంది అకాడమీకి వచ్చి శిక్షణ తీసుకుంటారు. శిక్షణ తీసుకున్న పలువురు విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించి బంగారు పతకాలు సైతం సొంతం చేసుకున్నారు. భారత్ తరపున ఒలింపిక్స్‌లో పాల్గొని ఆర్చరీలో బంగారు పతకం సాధించడమే తమ కలగా కొంత మంది విద్యార్థులు చెబుతున్నారు.
ప్రభుత్వం సహకారం అందిస్తే మరిన్ని అద్బుతాలు:
రాష్ట్రం నుంచి ఆర్చరీలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువ మంది పాల్గొనేలా చేయడమే తన ఉద్దేశమని శిక్షకుడు జయరాజ్ తెలిపారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి మరింత చేయూత అందిస్తే ఎక్కువ మందికి ఈ విద్యను చేరువ చేసేందుకు ప్రయత్నిస్తానని జయరాజు చెబుతున్నారు.
ఇవీ చదవండి: