Minister ambati on polavaram: పోలవరం ప్రాజెక్టు వద్ద వరద పరిస్థితిని ఆదివారం మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఎక్కడైనా డయాఫ్రంవాల్ 25 నుంచి 30 మీటర్ల లోతులో ఉండటం చూశామని, పోలవరంలో మాత్రం 100 మీటర్ల లోతున ఉందని పీపీఏ సభ్యులు చెప్పారన్నారు. అందుకే పీపీఏ, సీడబ్ల్యూసీ సభ్యులు సహా అందరి సలహాలు తీసుకుంటున్నామన్నారు. ఇటీవల గోదావరిలో 26 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహించిందని తెలిపారు. దిగువ కాఫర్‌డ్యాం వద్ద ఎంతవరకు పనులు చేయవచ్చనేది పరిశీలించడానికి తాను ఇక్కడికి వచ్చానన్నారు. వరద తగ్గే క్రమంలో దిగువ కాఫర్ డ్యాంలో కొంతమేర పనులు చేసేలా ప్రణాళిక రూపొందించామని వెల్లడించారు. గతంలో హడావుడిగా పనులు చేయడం, పక్కా ప్రణాళిక లేకపోవడంతోనే ప్రాజెక్టులో ఫలితాలు సరిగ్గా లేవన్నారు. తేదీ ప్రకటించడం ముఖ్యం కాదు చిత్తశుద్ధితో పనిచేస్తామని తెలిపారు. మంత్రి వెంట ప్రాజెక్టు సీఈ బి.సుధాకరబాబు, ఎస్‌ఈ కె.నరసింహమూర్తి, ఈఈలు ఆదిరెడ్డి, సుధాకరరావు, పోలవరం ఎంపీపీ వెంకటరెడ్డి పలువురు డీఈలు, మేఘా ఇంజినీరింగ్ సంస్థ ప్రతినిధులు ఉన్నారు.
వరదను పరిశీలించిన పీపీఏ సభ్యులు: పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యదర్శి ఎం.రఘురామ్, చీఫ్ ఇంజినీర్ రాజేష్‌కుమార్, డైరెక్టర్ పి.దేవేంద్రరావు ఎగువ, దిగువ కాఫర్‌డ్యాంల వద్ద వరద పరిస్థితిని పరిశీలించారు. అనంతరం మంత్రి అంబటి రాంబాబుతో కొంతసేపు మాట్లాడారు. డైరెక్టర్ దేవేంద్రరావు విలేకరులతో మాట్లాడుతూ పనులు ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే విషయమై జలవనరుల శాఖాధికారులతో మాట్లాడుతున్నామన్నారు. వరదలు తగ్గాక డయాఫ్రం వాల్ వద్ద పరీక్షలు చేస్తామని తెలిపారు.
ఇవీ చదవండి: