CM JAGAN TOUR: పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకులో ఈ నెల 21వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా తణుకులో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకుగానూ హెలిప్యాడ్, పార్కింగ్‌లకు అనువైన స్థలాలను మంత్రి పరిశీలించారు.
స్థానికంగా ఉండే శ్రీ ముళ్లపూడి వెంకటరాయ మెమోరియల్ పాలిటెక్నిక్ కళాశాల, శ్రీ చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణాలను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. జగన్ పుట్టినరోజైన డిసెంబర్ 21వ తేదీన తణుకులో సంపూర్ణ భూ హక్కు పథకాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. గత ప్రభుత్వం హయాంలో సుమారు 52 లక్షల మంది ఇళ్లు నిర్మించుకున్నట్లు గుర్తు చేశారు. వారిలో 32 లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని మంత్రి వివరించారు. లబ్ధిదారులకు ప్రైవేటు ఆస్తి మాదిరిగా దస్తావేజులు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.
ఓటీఎస్ పథకాన్ని గత ప్రభుత్వాల హయాంలోనే ప్రవేశపెట్టారని మంత్రి గుర్తు చేశారు. అప్పుడు కేవలం వడ్డీ మాత్రమే మాఫీ చేసినట్టు చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పూర్తిగా మాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని పేర్కొన్న మంత్రి.. చివరకు 43,667 మంది వడ్డీతోసహా చెల్లించినా ఎటువంటి హక్కూ లేని డీ ఫారం పట్టాలు ఇచ్చారని చెప్పారు.
కాగా.. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్‌ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకం ఇటీవల ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా భూ వివాదాలకు ముగింపు పలికే అవకాశముందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం భూ యజమానులకు భూములపై ఊహాజనితమైన హక్కులు మాత్రమే ఉన్నాయని ప్రభుత్వం చెప్తోంది. అయితే.. భూరక్ష-భూహక్కు పత్రం ద్వారా పూర్తి హక్కులు కల్పించనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో భూ కబ్జాలు, స్థిరాస్తికి సంబంధించి అవకతవకలు సహా భూ సమస్యలు పరిష్కరించి రైతులకు స్థిరాస్తులపై పూర్తి స్థాయిలో హక్కు కల్పించేందుకు రీ-సర్వే చేపట్టినట్లు రాష్ట్రప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:
School Education On Merging: 'హైస్కూళ్లలో 100లోపు విద్యార్థులుంటే విలీనం వద్దు'