ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు సి.రామచంద్రయ్య, దువ్వాడ శ్రీనివాస్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, చల్లా భగీరథరెడ్డి, కరీమున్నీసా, షేక్ మహమ్మద్ ఇక్బాల్‌లను అభ్యర్థులుగా వైకాపా ప్రకటించింది. వీరిలో ఇద్దరు ముస్లిం మైనారిటీలకు చెందినవారు కాగా ఎస్సీ, కాపు, కాళింగ, రెడ్డి సామాజికవర్గాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ఖరారు చేసిన అభ్యర్థుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వైకాపా కేంద్ర కార్యాలయంలో గురువారం ప్రకటించారు.
పలువురికి ఆశాభంగం
2019 ఎన్నికలకు ముందు, పాదయాత్ర సమయంలో పలువురికి ఎమ్మెల్సీగా అవకాశమిస్తామని ముఖ్యమంత్రి జగన్ హామీనిచ్చారు. వారిలో ఎక్కువ మంది ఇప్పుడు అవకాశం వస్తుందని ఆశించారు. ఇటీవల గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీ కోటాలో దాదాపు అవకాశం వచ్చినట్లే వచ్చి వెనక్కిపోయిన మోషేను రాజుకు ఇప్పుడు ఇస్తారన్న ప్రచారం జరిగింది. ఆయనకు అవకాశం రాలేదు. గుంటూరు జిల్లాలో మర్రి రాజశేఖర్‌ను మంత్రిమండలిలోకి తీసుకుంటానని జగన్ లోగడ బహిరంగంగా ప్రకటించారు. అందువల్లే అప్పట్లో ఆయన టికెట్‌ను వదులుకున్నారు. ఆయన్ను మంత్రిమండలిలోకి తీసుకోవాలంటే ముందు ఎమ్మెల్సీని చేయాల్సి ఉంది. ఆయనకూ ఇప్పుడు అవకాశం లేకపోయింది. ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి పిల్లి సుభాష్‌చంద్రబోస్ రాజీనామాతో ఖాళీ అయింది. ఆ స్థానాన్ని తూర్పుగోదావరి జిల్లాకే చెందిన తోట త్రిమూర్తులుకు ఇస్తారన్న చర్చ జరిగినప్పటికీ ఆయనకూ అవకాశం రాలేదు. గన్నవరంలో దుట్టా రామచంద్రరావు, చీరాలలో ఆమంచి కృష్ణమోహన్, రాజంపేటలో ఆకేపాటి అమర్‌నాథరెడ్డిలాంటి వారికీ ఎమ్మెల్సీగా అవకాశమిస్తామని ముఖ్యమంత్రి హామీనిచ్చారని అంటున్నారు. వచ్చే 2నెలల్లో ఖాళీ అయ్యే స్థానాల్లో వారిలో కొందరికి అవకాశమిస్తారని వైకాపా నేతలు చెబుతున్నారు.
రామచంద్రయ్య
గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఈయనకు ఎమ్మెల్సీగా అవకాశమిస్తామని జగన్ లోగడ హామీనిచ్చారు. లోగడ ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన అనుభవం రామచంద్రయ్యకు ఉంది.
దువ్వాడ శ్రీనివాస్
శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన నాయకుడు. సార్వత్రిక ఎన్నికల్లో టెక్కలి కాదని, శ్రీకాకుళం లోక్‌సభ స్థానంలో పోటీ చేయాలని పార్టీ నాయకత్వం చెప్పడంతో తదనుగుణంగా బరిలో దిగి ఓడిపోయారు. పంచాయతీ ఎన్నికల్లో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలిలో ఎక్కువ స్థానాలను వైకాపా మద్దతుదారులు కైవసం చేసుకోవడం వెనక దువ్వాడ భాగస్వామ్యం కూడా ఉందని అంటున్నారు. అచ్చెన్నాయుడిలాంటి నాయకుడిని ఆ నియోజకవర్గంలో దీటుగా ఎదుర్కొనేందుకు దువ్వాడకు పదవి ఉండాలని ఇప్పుడు అవకాశమిచ్చారంటున్నారు.
కళ్యాణ్ చక్రవర్తి
తిరుపతి వైకాపా ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ హఠాన్మరణం తరువాత ఉపఎన్నికల్లో ఆయన కుటుంబీకులకే వైకాపా నుంచి అవకాశమిస్తారని అప్పట్లో చర్చ జరిగింది. అయితే ఆ స్థానాన్ని మరో అభ్యర్థికి ఖరారు చేయడం వల్ల దుర్గాప్రసాద్ కుమారుడు కళ్యాణ్‌కు ఎమ్మెల్సీగా అవకాశమిస్తామని ముఖ్యమంత్రి స్వయంగా హామీనిచ్చారు. ఇప్పుడు కళ్యాణ్‌కు అవకాశమివ్వడం వల్ల ఎస్సీ అభ్యర్థికి స్థానం దక్కినట్లయింది. పైగా తిరుపతి ఉపఎన్నికల్లో దుర్గాప్రసాద్ కుటుంబం ప్రచారం చేసేందుకు వారికి బలం చేకూర్చినట్లవుతుందని ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్లేషిస్తున్నారు.
చల్లా భగీరథరెడ్డి
ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన స్థానాన్ని ఆయన కుమారుడు భగీరథరెడ్డికి ఇచ్చారు.
ఇక్బాల్
2019లో హిందూపురం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఇక్బాల్‌కు ఎమ్మెల్సీగా అవకాశమిస్తామని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొత్తలోనే జగన్ బహిరంగంగా ప్రకటించారు. ఆ వెంటనే జరిగిన ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో ఇక్బాల్‌కు అవకాశమిచ్చారు. అయితే ఆ ఎమ్మెల్సీ పదవీ కాలపరిమితి ఏడాదిన్నరే ఉంది. దీంతో ఆయనకు తిరిగి అదే స్థానంలో కొనసాగిస్తామని జగన్ హామీనిచ్చారు. హిందూపురం తెదేపాకు కంచుకోటగా నిలుస్తున్న పరిస్థితుల్లో.. అక్కడ ఎమ్మెల్సీగా ఇక్బాల్ సేవలు అవసరమనే ఉద్దేశంతో అవకాశం ఇచ్చారని అంటున్నారు.
కరీమున్నీసా
విజయవాడలో కార్పొరేటర్‌గా పనిచేసిన ఈమెను అక్కడి నగరపాలక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారని ప్రచారం సాగుతోంది. విజయవాడలో వైశ్య, బ్రాహ్మణ వర్గాలకు చెందిన వెలంపల్లి శ్రీనివాస్‌కు మంత్రిగా, మల్లాది విష్ణుకు బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పదవులనిచ్చారు. ముస్లిం వర్గానికి చెందినవారికి ఎమ్మెల్సీగా అవకాశమివ్వడం ద్వారా సమతూకాన్ని పాటించినట్లవుతుందని, అంతేగాక మహిళకు ఇచ్చినట్లవుతుందన్న ఆలోచనతో కరీమున్నీసాకు అవకాశమిచ్చారని చెబుతున్నారు.
ఇదీ చదవండి: ఈనెల 29న ముగియనున్న ఎమ్మెల్సీల పదవీకాలం.. ప్రభుత్వ నోటిఫికేషన్ జారీ