స్వయం సహాయక సంఘాలకు సాయమే లక్ష్యంగా ప్రభుత్వం వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్నిఅమల్లోకి తెచ్చింది. ముఖ్యమంత్రి జగన్ ఆన్‌లైన్‌లో నగదు జమచేసి...పథకాన్ని ప్రారంభించారు. కరోనా విపత్తు సమయంలో ప్రభుత్వానికి ఆర్థిక కష్టాలు ఉన్నా.. మహిళలకు అండగా నిలబడుతున్నట్లు సీఎం తెలిపారు.
వైఎస్సార్ సున్నావడ్డీ పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ లాంఛనంగా ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో.... స్వయం సహాయక సంఘాల ఖాతాల్లోకి పథకం కింద... 14వందల కోట్ల రూపాయలను జమచేశారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం... జిల్లా కలెక్టర్లు, స్వయం సహాయక సంఘాల మహిళలతో ముచ్చటించారు.
కరోనా ప్రభావంతో ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ.. మహిళలకు మేలు చేసేందుకే సున్నావడ్డీ పథకాన్ని ప్రారంభించినట్లు సీఎం జగన్ తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 8 లక్షల 78 వేల సంఘాల్లోని 91 లక్షల మంది సభ్యులకు మేలు చేకూరుతుందన్నారు. ప్రతి గ్రూపునకు కనీసం 20 నుంచి 40 వేల వరకు లబ్ధి చేకూరుతుందని సీఎం వెల్లడించారు. గతంలో తన తండ్రి పావల వడ్డీకే రుణాలు అందుబాటులోకి తీసుకొచ్చారన్న సీఎం జగన్... 2016లో ఈ పథకాన్ని పూర్తిగా ఎత్తేశారని చెప్పారు. ఇకపై ఏటా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 3 లక్షల పరిమితి వరకూ... 6 జిల్లాల్లో.. 7 శాతం వడ్డీకి బ్యాంకులు.... డ్వాక్రా సంఘాలకు రుణాలిస్తున్నాయని సీఎం జగన్ వెల్లడించారు. మిగిలిన 7 జిల్లాల్లో 7 నుంచి 13 శాతం వరకూ ఉన్న వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తోందని తెలిపారు. అన్ని జిల్లాల్లోనూ సున్నావడ్డీ పథకాన్ని మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు చెక్కులు అందజేశారు.
ఇవీ చదవండి: రెడ్‌జోన్ ప్రాంతాలపై నిఘా కోసం మరో యాప్: డీజీపీ