కరోనా కారణంగా ఈ ఏడాది వినాయక చతుర్థి నిర్వహణకు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం సూచిస్తోంది. బహిరంగ వినాయక మండపాలు, సామూహిక నిమజ్జనానికి అనుమతి లేదని.. ఇళ్లల్లోనే పూజలు చేసుకోవాలని పేర్కొంది. విగ్రహాల పొడవు 2 అడుగుల కన్నా ఎక్కువగా ఉండకూడదని నిర్దేశించింది. విగ్రహాలు ఎక్కడ ప్రతిష్టిస్తారో అక్కడే నిమజ్జనం చేయాలని సూచించింది. ఊరేగింపులు, లౌడ్ స్పీకర్లు, డీజేలకు అనుమతులు లేదని స్పష్టం చేసింది.
అంతకుముందు వినాయక చవితి జరుపుకునేందుకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ ఏపీ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రభుత్వానికి లేఖ రాశారు. సోము వీర్రాజు 10 నిబంధనలు సూచించారు. ఈ నిబంధనలే ప్రభుత్వ జీవోలోనూ కనిపించాయి.
ఈ నిబంధనలపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. "వినాయక చవితి ఎలా జరుపుకోవాలో సోము వీర్రాజు 10 సూచనలు చేశారు.. ప్రభుత్వం జీవో తీసుకువచ్చింది. విగ్రహం ఎత్తు ఎంత ఉండాలో, ఎక్కడ నిమజ్జనం చేయాలో, ఎలా చేయాలో, కొవిడ్ నివారణకు పూజలు చేయాలని చెబుతున్నారు. రాజకీయ పార్టీలు మన పూజ గదుల్లోకి వచ్చి, ఎలా పూజ చేసుకోవాలో శాసించే విధానాలను మనం భరించాలా?" అని ఎంపీ ప్రశ్నించారు.
ఇదీ చదవండి : ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు