'గడప గడపకూ వెళ్లినపుడు ప్రజలు ఆదరిస్తున్నప్పటికీ.. మంచినీరు, రోడ్లు, మురికి కాల్వలు, పొలాలకు దారుల గురించి ఎక్కడికక్కడ అడుగుతున్నారు' అని పలువురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి జగన్‌కు తెలిపారు. బుధవారం ముఖ్యమంత్రి నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఎమ్మెల్యేలు తమ అనుభవాలను వివరించారు. ఎమ్మెల్యేలకు ఇస్తామన్న నిధులు రూ.2 కోట్లు కాకుండా కనీసం రూ. 5 కోట్ల చొప్పున ఇస్తే.. ఇప్పుడు, వచ్చే ఏడాది కలిపి రూ.10 కోట్లవుతాయి వాటితో నియోజకవర్గాల్లో ఏవైనా పనులు పూర్తి చేయగలమని పలువురు ఎమ్మెల్యేలు సీఎంను కోరారు. దీనికి సీఎం ‘ఇచ్చాం కదా? ఆ నిధులు కలెక్టర్ల వద్ద ఉంటాయి, మీరు పనులకు సంబంధించి లేఖలు ఇచ్చి వాటిని వినియోగించుకోవచ్చు’ అని చెప్పారు. అయితే నిధులు రాలేదని ఎమ్మెల్యేలు మళ్లీ చెప్పడంతో.. ‘సీఎంఓ అధికారి వైపు సీఎం చూశారు. ‘జీఓ ఇవ్వాలి, వచ్చే వారంలోపు జారీ చేస్తాం’ అని ఆ అధికారి సమాధానమివ్వడం కొసమెరుపు. ‘అర్హులెవరూ పథకాలు అందకుండా మిగిలిపోకూడదు. అదే సమయంలో అనర్హులకు పథకాలు అందడానికీ వీల్లేదు’ అని సీఎం స్పష్టం చేసినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు పలువురు ఎమ్మెల్యేలు వెలిబుచ్చిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.
‘విద్యుత్ కోతలున్నాయి.. బోర్లు వేయించుకుంటామంటే విద్యుత్ శాఖవాళ్లు మెటీరియల్ సకాలంలో ఇవ్వడం లేదని రైతులు చెబుతున్నారు. ఇసుక సమస్య కూడా ఉంది. ఇసుక డిపోల సంఖ్యను పెంచాలి’
- ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి (కందుకూరు)
సీఎం: ‘విద్యుత్ కోతలు తెదేపా హయాంలోనే ఎక్కువ. ఇప్పుడు చాలా తక్కువ. బొగ్గు కొనేందుకే రోజుకు రూ.40 కోట్లు అదనంగా ఖర్చవుతోంది. ఇబ్బందులున్నా కోతలు తగ్గించాం. తెదేపా హయాంలో కోతలు ఎలా ఉండేవి, ఇప్పుడు మనం ఎంత తగ్గించామనేది ప్రజలకు వివరించాలి.
* ‘మంచినీళ్ల కోసం ప్రజలు, పొలాలకు వెళ్లేందుకు దారులు నిర్మించాలని రైతులు అడుగుతున్నారు’
- వై.బాలనాగిరెడ్డి (మంత్రాలయం)
సీఎం: మీకు (ఎమ్మెల్యే) ఇచ్చిన రూ.2 కోట్లలో ఖర్చు చేయండి, ఇంకా నిధులు అవసరమైతే చూద్దాం.
* ‘రైతులు పొలాలకు దారులు అడుగుతున్నారు, ఉపాధి హామీ నిధులతో వాటిని వేస్తే బాగుంటుంది. మురికి కాల్వలు, రోడ్ల నిర్మాణం గురించి కూడా అడుగుతున్నారు’
- సాయిప్రసాదరెడ్డి (ఆదోని)
సీఎం: ‘ఉపాధి నిధులు కేంద్రం నుంచి రావాల్సి ఉంది, ఫైల్ కదులుతూ..ఉంది అని వాళ్లంటున్నారు, ఆ డబ్బు వస్తే కొన్ని పనులు చేయొచ్చు. ప్రాధాన్యక్రమంలో ఏ రోడ్డు ముందు వేయాలనేది ప్రజలు, రైతులనే అడగండి, వాటిని మీకిస్తున్న ఎమ్మెల్యే నిధులతో వేయండి, ఇంకా అవసరం ఉంటే చూద్దాం.. 100 శాతం రోడ్లను నిర్మించడమనేది సాధ్యపడకపోవచ్చు.
* ‘గిరిజన ప్రాంతాల్లోని గిరిజనేతరులు కొనుక్కున్న ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వడం లేదు, ఈ సమస్యకు పరిష్కారం చూపాలి’
- ఎమ్మెల్యే బాలరాజు (పోలవరం)
సీఎం: సాధ్యాసాధ్యాలేంటో చూడండి (అధికారులకు ఆదేశం)
* ‘బ్యాంకులో రుణాల కోసం చాలామంది ఆదాయపు పన్ను కట్టినట్లు రిటర్నులు చూపుతున్నారు. వారు ఐటీ చెల్లింపుదారులన్న కారణంతో సంక్షేమ పథకాలు అందడం లేదు.’
- ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి (పెనమలూరు)
చర్చ: ఈ అంశంపై కొంత చర్చ జరిగాక.. వరుసగా నాలుగేళ్లు ఇలా పన్ను రిటర్నులు దాఖలు చేయని వారిని అర్హులుగా గుర్తించవచ్చనే ప్రతిపాదన వచ్చింది. దీనికి సీఎం సానుకూలత వ్యక్తంచేశారు.
ఎమ్మెల్యేలకు ‘ద్వార దర్శనమైనా ఇవ్వండి’
‘వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నపుడు ఎమ్మెల్యేలను ద్వార దర్శనం ద్వారా పలకరించేవారు, ఇప్పుడు మీరు ఆ పద్ధతిలో దర్శనమిస్తే రోజుకు 20 మంది ఎమ్మెల్యేలు కలిసే అవకాశం ఉంటుంది’
- ఎమ్మెల్యే పేర్ని నాని (మచిలీపట్నం)
సీఎం: ఇప్పుడు నలుగురైదుగురికి సమయం ఇస్తుంటే ఒక్కొక్కరు అరగంటకు పైగా మాట్లాడుతున్నారు, 20 మందికి అంటే సాధ్యమేనా? (పేర్ని కల్పించుకుంటూ అందుకే ద్వార దర్శనం రెండు నిమిషాలు అని చెప్పబోగా).. అలా ద్వారం వద్దే పలకరించి పంపేస్తే కనీసం లోపలికి పిలిచి మాట్లాడలేదు అని మీరు ఇబ్బంది పడతారేమోనని అనుకుంటున్నా’.