గ్రామ స్వరాజ్యం అంటే వైకాపాకి ఆర్ధిక స్వరాజ్యం కాదని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. అసలైన గ్రామ స్వరాజ్యాన్ని దేశానికే చూపించామని జగన్ చెప్పడం కన్నా దారుణం మరొకటి లేదని మండిపడ్డారు. గ్రామ స్వరాజ్యం గురించి జగన్ మాట్లాడటం స్వరాజ్య భావననే ఎగతాళి చేయడమన్నారు.
దాడులు చేయడమే గ్రామ స్వరాజ్యమా
ఎన్నికల పరిశీలనకు వెళ్లిన ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలపై పట్టపగలే మాచర్లలో హత్యాయత్నం జరగడం.. వైకాపా గ్రామ స్వరాజ్యంలో భాగమేనా అని నిలదీశారు. ప్రతిపక్షాల అభ్యర్ధులపై తప్పుడు కేసులు పెట్టించి, నామినేషన్లు విత్ డ్రా చేయించడం వైకాపా గ్రామ స్వరాజ్యమా అని ప్రశ్నించారు. సీఎం జగన్కు గ్రామ స్వరాజ్యం అనే పదానికి అర్ధం తెలిసుంటే 73, 74వ రాజ్యాంగ సవరణలు చిత్తశుద్ధితో ఎందుకు అమలు చేయడం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలతో, బలవంతపు ఉప సంహరణలతో, ఏకపక్షం చేసుకోవడం ఎందుకని నిలదీశారు.
సీఎంకు రాజ్యాంగంపై గౌరవం లేదు
తెదేపా ప్రభుత్వం చేసిన ఖర్చులో మూడోవంతు కూడా వైకాపా ప్రభుత్వం గ్రామీణాభివృద్దికి ఖర్చు చేయలేదన్నారు. దీన్ని బట్టే జగన్ ప్రభుత్వం గ్రామీణాభివృద్దికి ఇచ్చే ప్రాధాన్యత తెలుస్తోందన్నారు. అసలు రాజ్యాంగాన్నే గౌరవించని జగన్మోహన్ రెడ్డి, అంబేడ్కర్ సమానత్వంపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. జస్టిస్, ఈక్వాలిటి, ప్రాటర్నిటి, లిబర్టీ గురించి మాట్లాడే నైతికత జగన్మోహన్ రెడ్డికి లేదన్నారు. భారత రాజ్యాంగంపై ఆయనకు గౌరవం లేదని విమర్శించారు. 14నెలల పాలనలో పదేపదే రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడ్డారన్నారు. ప్రియాంబుల్కు రాష్ట్రంలో ఎలాంటి కనీస గౌరవం ఇవ్వకుండా, అదే ప్రియాంబుల్ గురించి జగన్ ఎలా మాట్లాడతారన్నారు.
చెప్పేదొకటి.. చేసేదొకటి
వైకాపా ప్రభుత్వ 14నెలల పాలనలో రాష్ట్రంలో ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను హరించేశారని, ప్రాథమిక హక్కులు కాలరాశారన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛను అణిచి వేశారన్నారు. వేలాది మందిపై తప్పుడు కేసులు బనాయించి, అక్రమంగా అరెస్టులు చేసి జైళ్లకు పంపారని మండిపడ్డారు. చివరికి మీడియా స్వేచ్ఛను కూడా అణిచివేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ చెప్పేదొకటి చేసేదొకటి అనడానికి ఇంతకన్నా ఉదాహరణ మరొకటి లేదన్నారు. సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని జగన్ చెప్పడం మరో దారుణమన్నారు. 600కుపైగా పోస్టులు సొంత సామాజిక వర్గానికే కేటాయించడం, అడ్వయిజర్లుగా, నామినేటెడ్ పోస్టులలో అయినవాళ్లనే నియమించడం జగన్మోహన్ రెడ్డి ఆచరించే సామాజిక న్యాయమా అని ప్రజలే నిలదీస్తున్నారని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి...
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు.. జలదిగ్భందంలో లోతట్టు ప్రాంతాలు