నిధులు విడుదల చేయవద్దని ట్రెజరీలకు ఆంక్షలు విధించడం అమానుషమని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ప్రభుత్వ విధానాన్ని తప్పుబట్టారు. కేంద్రం ఇచ్చిన కరోనా ఉపశమన నిధులు తొక్కిపెట్టడం హేయమన్నారు. కరోనా వైరస్‌కు వైఎస్సార్ కరోనా, జగన్ కరోనా అని పేర్లు పెట్టుకోవాలని యనమల ఎద్దేవా చేశారు. ఉద్యోగుల జీతాలకు, కరోనా సహాయ చర్యలకు నిధులు విడుదల చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం ట్రెజరీకి ఆదేశాలివ్వడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులు, డివెల్యూషన్ కింద రావాల్సిన గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, కొవిడ్ 19 ఉపశమన నిధులు, 14వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్ర పుష్కలంగా వచ్చాయని యనమల తెలిపారు. ప్రస్తుతం కరోనా కిట్లు, మాస్కులు, పీపీఈలు, వైద్యం, పారిశుద్ధ్య పనులకు నిధులు అత్యవసరంగా కావాల్సిన ఉన్నప్పటికీ.. నిధుల విడుదల స్తంభింపచేయడాన్ని యనమల తప్పుబట్టారు.
వలస కూలీల కష్టాలు పట్టవా?
ప్రజలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా నిధులు విడుదల చేయొద్దని చెప్పిన ప్రభుత్వం ఎక్కడైనా ఉందా అని యనమల ఆక్షేపించారు. ప్రజలకు నిత్యావసర సరకుల పంపిణీలో వైకాపా ప్రభుత్వం విఫలమైందన్న ఆయన... ప్రజలు విరాళంగా ఇచ్చిన నిధులే ఖర్చు చేయాలని స్థానిక సంస్థలకు ప్రభుత్వం సూచించినట్లు కనిపిస్తోందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను తామే ఇచ్చినట్లుగా గొప్పలు చెబుతున్నారని, వలస కూలీల కష్టాలను రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని దుయ్యబట్టారు.
లెక్కలు చెప్పండి
పొరుగు రాష్ట్రాలలో, దేశాల్లో చిక్కుకుపోయిన తెలుగువారిని రాష్ట్రానికి రప్పించడంపై శ్రద్ధ పెట్టడం లేదని విమర్శించారు. కొవిడ్-19 వైరస్ తీవ్రతను తక్కువగా చూపాలని వైకాపా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఏడాదిగా రాష్ట్రానికి వచ్చిన రాబడులు, తెచ్చిన అప్పులు, కేంద్రం ఇచ్చిన నిధుల లెక్కలు వెల్లడించాలని యనమల డిమాండ్ చేశారు.
జీవో రద్దు స్వాగతిస్తున్నాం
ఆంగ్ల మాధ్యమం జీవోలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని యనమల అన్నారు. శాసనమండలిలో తెదేపా పేర్కొన్నట్లుగా మాధ్యమ ఎంపిక విద్యార్ధులకే ఇవ్వాలని సూచించారు. కోర్టులు అనేకసార్లు వైకాపా ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలను తప్పుపట్టినా వారిలో మార్పులేకపోవడం శోచనీయమని యనమల రామకృష్ణుడు విమర్శించారు.
ఇదీ చదవండి: