ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చే వార్షిక బడ్జెట్‌కు గవర్నర్ ఆమోదముద్ర వేయరాదని శాసనమండలి ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న తిరుపతి ఉపఎన్నిక, పెండింగ్‌లో ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సాకుతో బడ్జెట్ సమావేశాలు వాయిదా వేయటం పలాయనవాదమని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి ప్రజలు, ప్రతిపక్షాలు, చట్టసభలంటే లెక్కేలేదని దుయ్యబట్టారు. దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఇలాంటి కుంటిసాకులు, దొంగవంకలు చూపి బడ్జెట్ వాయిదా వేయలేదని వెల్లడించారు.
గతంలోనూ ఇదే తరహాలో తెచ్చిన మొక్కుబడి బడ్జెట్‌తో పాటు 3 రాజధానుల బిల్లును శాసనమండలి వ్యతిరేకించిందని గుర్తుచేశారు. ఇప్పుడు అదే తరహాలో మమ అనిపించుకున్నారని మండిపడ్డారు. బడ్జెట్ సమావేశాలంటేనే జగన్ భయపడుతున్నారని విమర్శించారు. శాసనమండలిలో ప్రజా వ్యతిరేక విధానాలను ఎక్కడ తిరగ్గొడతారనే భయంతో అసెంబ్లీ, కౌన్సిల్ ఫోబియోతో సతమతమవుతున్నారని ఆక్షేపించారు. శాసనమండలిలో మెజారిటీ వచ్చాకే 2 సభల్లో తన ఫాసిస్ట్ చర్యలను ఆమోదించుకోవాలనే దురాలోచన జగన్‌దని మండిపడ్డారు. మార్చిలోపు బడ్జెట్ ఆమోదం పొందే సత్ సంప్రదాయాన్ని కూడా కాలరాశారని ధ్వజమెత్తారు.
ఇదీ చూడండి. ఇసుక ఆదాయమే వందల కోట్లయితే..వేలకోట్ల అవినీతి ఎలా?