మద్యం దుకాణాల(Wine Shops allotment) కేటాయింపు కోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లాటరీ నిర్వహించగా... దరఖాస్తుదారులతో ఆయా ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. కలెక్టర్ల ఆధ్వర్యంలో జరిగిన లాటరీ ప్రక్రియలో దరఖాస్తుదారులకు మద్యం దుకాణాలను (wines tender in telangana) కేటాయించారు. భారీగా దరఖాస్తులు వచ్చిన చోట ప్రత్యేకంగా ఫంక్షన్ హాల్స్‌లో ప్రక్రియ నిర్వహించారు. రాష్ట్రంలోని 2,600 మద్యం దుకాణాలను దరఖాస్తుదారులకు కేటాయించారు. మద్యం దుకాణాల లైసైన్సుల్లో ప్రభుత్వం ఈసారి రిజర్వేషన్లు అమలు చేసింది. ఎస్సీలకు 262, ఎస్టీలకు 131, గౌడ్లకు 393 దుకాణాలు కేటాయించింది. మిగతా 1,834 దుకాణాలు ఓపెన్ కేటగిరీలో కేటాయించారు. 67,089 దరఖాస్తుదారుల నుంచి రూ. 2లక్షల చొప్పున ప్రభుత్వానికి ఏకంగా రూ.1356.99కోట్ల ఆదాయం సమకూరింది.
మేడ్చల్ మల్కాజిగిరి పరిధిలోని మద్యం దుకాణాలకు కొంపల్లిలోని కేవీఆర్ కన్వెన్షన్లో హాల్ లో డ్రా (wine shop lotteries ) తీశారు. వరంగల్, హనుమకొండ, మంచిర్యాలలో లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఖమ్మం సీక్వెల్ రిసార్స్ట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 122 దుకాణాలను దరఖాస్తుదారులకు కేటాయించారు. దరఖాస్తు దారులు వేలాదిగా తరలి రావటంతో జనాలతో నిండిపోయింది. మద్యం దుకాణాల కేటాయింపు(liquor shop lotteries latest news) రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష మహిళా సంఘాల నాయకులు అందోళన నిర్వహించారు. డ్రా తీసే ప్రాంగణం లోపలికి చోచ్చుకు వచ్చేందుకు ప్రయత్నించటంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. మెదక్, ఆదిలాబాద్ జిల్లాలో లక్కీ డ్రా నిర్వహించిన కలెక్టర్లు ఎంపిక ప్రక్రియను పర్యవేక్షించారు.
నాలుగింతల ఆనందం
ఈచిత్రంలో కనిపిస్తున్నవారు మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ క్యాసారంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మహిళలు. అత్త, ఇద్దరు తోడికోడళ్లు, వారి ఆడపడుచు. నలుగురూ కలిసి మద్యం దుకాణాలకు తొమ్మిది టెండర్లు వేశారు. డ్రాలో నలుగురికీ నాలుగు దుకాణాలు లభించడంతో ఆనందంతో అక్కడే శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. కొంపల్లిలోని కేవీఆర్ ఫంక్షన్‌హాల్‌లో కనిపించిన దృశ్యమిది.
కరీంనగర్‌లో జిల్లాలో 94 మద్యం దుకాణాల(liquor shop tenders) కేటాయింపులో భాగంగా 'డ్రా' తీస్తుండగా ఓ షాపు విషయంలో వాగ్వాదం చోటు చేసుకొంది. ఆరో నంబర్ దుకాణం కేటాయించకుండా తాత్సారం చేయడంతో దరఖాస్తుదారులు అభ్యంతరం తెలిపారు. ఒక్కరు రాకపోతే డ్రా ఆపడమేంటన్న మిగతా దరఖాస్తుదారులు ఇతర నంబర్లతో డ్రా తీయాలని డిమాండ్ చేశారు. అధికారులతో వాగ్వాదానికి దిగగా పోలీసులు వారిని అడ్డుకొనే యత్నం చేయటంతో ఉద్రిక్తత నెలకొంది. ఉన్నతాధికారులు సర్దిచెప్పటంతో వివాదం సద్దుమణిగింది.
లాటరీ తీయలేదని ఆత్మహత్యాయత్నం
జగిత్యాల జిల్లా కేంద్రంలో శనివారం మద్యం దుకాణాల కేటయింపునకు లాటరీ నిర్వహిస్తుండగా ఒక దుకాణానికి లాటరీ వాయిదా వేయడంతో దరఖాస్తుదారుడు డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జిల్లాలోని సారంగాపూర్ మద్యం దుకాణం కోసం కేవలం ఆరు దరఖాస్తులే వచ్చాయి. కనీసం పది దరఖాస్తులు వస్తేనే లాటరీ తీయాలన్న నిబంధన ఉండడంతో జిల్లా కలెక్టర్ రవి లాటరీ నిలిపివేశారు. దీంతో దరఖాస్తుదారులు ఆందోళనకు దిగారు. అందులో ఒకరైన చల్‌గల్ గ్రామానికి చెందిన కాసారపు రమేష్ ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా పోలీసులు అడ్డుకుని నచ్చజెప్పారు. దుకాణం కేటాయింపుపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెప్పారు.
ఇదీ చదవండి: Telangana TDP: నేడు తెలంగాణ వ్యాప్తంగా తెదేపా మౌనప్రదర్శనలు, దీక్షలు