తెలంగాణ గ్రేటర్ ఎన్నికల్లో తమకు డబుల్ డిజిట్ ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. కానీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం హస్తం పార్టీ సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందని అంచనా వేసింది. దీంతో కాంగ్రెస్‌లో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది.
బలమైన అభ్యర్థులు బరిలో ఉన్న డివిజన్లపైనే కాంగ్రెస్ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మెదక్, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 150 డివిజన్లు విస్తరించి ఉన్నాయి. అందులో హైదరాబాద్ స్థానంలో ఎంఐఎంకు గట్టి పట్టు ఉండడం వల్ల ఆయా డివిజన్లపై ఆశలు వదులుకుంది. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఒకట్రెండు సీట్లపైనే ఆశలు పెట్టుకుంది. రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్న మల్కాజిగిరి పరిధిలోని డివిజన్లపై ఎక్కువ ఆశలు పెట్టుకుంది. అక్కడ మొత్తం 45 డివిజన్లు ఉండగా.. అందులో 20కిపైగా డివిజన్లలో పార్టీకి బలమైన క్యాడర్ ఉందని.. బలమైన అభ్యర్థులున్నారని భావిస్తోంది. మెజార్టీ స్థానాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని ఓట్లేస్తే.. డబుల్ డిజిట్ ఫలితాలు ఒక్క మల్కాజిగిరిలోనే వస్తాయని అంచనా వేస్తోంది. అక్కడ రేవంత్‌రెడ్డి విస్తృతంగా పర్యటించారని.. స్థానికంగా బలమున్న వారికే టికెట్లు ఇచ్చినందున అంచనాలు తలకిందులు కావన్న ధీమాతో ఉన్నట్లు తెలుస్తోంది. ఫలితాలు కాంగ్రెస్ అంచనాలను నిజం చేస్తాయా.. లేక తలకిందులు చేస్తాయా అన్ని చూడాల్సి ఉంది.
ఇవీచూడండి: పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు