Wife Murdered Husband: ఇష్టం లేని పెళ్లనే కారణంతో వివాహానికి ముందే కొందరు యువతులు అబ్బాయిలపై దారుణాలకు ఒడిగడితే.. వివాహేతర సంబంధాల మోజులో పడి పవిత్రమైన దాంపత్య బంధాన్ని అవహేళన చేస్తున్నారు మరికొందరు మహిళలు. భవిష్యత్తులో తమ మధ్య సఖ్యత ఉండదని భావించినప్పుడు సామరస్యంగా పరిష్కరించుకునే సమస్యలను సైతం.. రక్తపాతం దాకా తీసుకెళ్తున్నారు. క్షణిక సుఖాల కోసం కట్టుకున్న వాడిని సైతం కడతేర్చడానికి వెనుకాడటం లేదు. పోనీ ఇలా చేశాక వారు అనుకున్నది ఏమైనా సాధించారా అంటే.. మన పోలీసుల విచారణలో వారి బండారం బయటపడి ఊచలు లెక్కపెడుతున్నారు. ప్రియుడి మోజులో పడిన ఓ భార్య.. తన భర్తను సుపారీ ఇచ్చి అతి కిరాతకంగా హత్య చేయించింది. ఘటన జరిగిన మూడు నెలలకు ఈ కుట్ర బయపడింది.
లాక్డౌన్లో పరిచయం: తెలంగాణలోని వనపర్తిలో మూడు నెలల క్రితం మిస్సింగ్ కేసుగా నమోదైన బాలస్వామి కేసు విషాదాంతమైంది. బాలస్వామిని హత్య చేసిన నిందితులు.. హైదరాబాద్ బాలాపూర్‌లో శవాన్ని పూడ్చిపెట్టారు. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు బయటపడగా.. పూడ్చిన స్థలంలో శవాన్ని వెలికితీశారు. వనపర్తి పట్టణం గాంధీ నగర్‌కు చెందిన బాల స్వామి(39)కి, లావణ్యతో 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. బాలస్వామి కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే మదనపురం మండలం దంతనూర్ గ్రామానికి చెందిన నవీన్.. లాక్డౌన్ సమయంలో వనపర్తిలో ఉన్న తన స్నేహితులను కలిసేందుకు వస్తుండేవాడు. ఆ సమయంలో నవీన్‌కు లావణ్యతో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. తరుచూ భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవ కాస్త... ప్రియుడి మోజులో పడేందుకు కారణమైంది.
పొలం అమ్మిన డబ్బులతో: ఈ క్రమంలో 5 నెలల క్రితం బాల స్వామి పొలం అమ్మడంతో రూ. 20 లక్షలు వచ్చాయి. లక్షల్లో డబ్బు కళ్లకు కనబడటంతో ప్రియుడి మోజులో ఉన్న లావణ్య.. భర్తను చంపాలని నిర్ణయించుకుంది. అందుకు పథకం వేసింది. దానిని అమలులోకి తెచ్చింది. భర్త వద్దకు వెళ్లి 'మనకు మరింత మంచి జరగాలంటే మైసమ్మ గుడి వద్దకు వెళ్లి కోడిని కోయాలి' అని చెప్పింది. దీంతో ఇద్దరూ జనవరి 20న అక్కడికి వెళ్లారు. అంతకు ముందే ప్రియుడు నవీన్.. హైదరాబాద్ బాలాపూర్‌కు చెందిన బంధువు కురుమూర్తి, మరో వ్యక్తి గణేశ్ కారులో వనపర్తికి వచ్చారు.
గొంతు నులిమి చంపి: గుడి వద్ద బాల స్వామిని బలవంతంగా కారులో ఎక్కించారు. అనంతరం కారులో గొంతు నులిమి చంపారు. అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను కొత్త కొట శివారులోని బిడ్జి వద్ద పడేశారు. అనంతరం హత్య చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న డబ్బుల కోసం మళ్లీ వనపర్తికి వచ్చారు. ఆమె రూ.60 వేలు ప్రియుడికి ఇచ్చింది. శవాన్ని పూడ్చమని నవీన్ కురుమూర్తి, గణేశ్‌కు అప్పగించాడు. దీంతో వాళ్లు శవాన్ని హైదరాబాద్ బాలాపూర్ శివారులోని శ్మశాన వాటిక వద్ద కురుమూర్తి బంధువు బంగారి సహాయంతో పూడ్చి పెట్టారు.
ఈ క్రమంలో బాలస్వామి కనిపించక పోవడంతో జనవరి 21న అతని తమ్ముడు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజు నుంచి లావణ్య సైతం కనిపించకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చి విచారణ చేపట్టారు. లావణ్య వారం రోజుల క్రితం ఆమె అన్నకు ఫోన్ చేసిన ఆధారంగా సిగ్నల్ ట్రేస్ చేసి పోలీసులు ఆమెను వనపర్తి పట్టణ శివారులో పట్టుకున్నారు. లావణ్య ప్రియుడు నవీన్, మరో ముగ్గురు నిందితులను కూడా బుధవారం అదుపులోకి తీసుకున్నారు. విచారణలో శవాన్ని పాతిపెట్టిన స్థలం చెప్పడంతో.. సంఘటన స్థలానికి వెళ్లి బయటికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం లావణ్య, నవీన్, కురుమూర్తి, గణేశ్, బంగారిలపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వనపర్తి సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. వివాహేతర సంబంధానికి ఆకర్షితురాలై.. కట్టుకున్న భర్తను చంపడమే కాకుండా తమ ఇద్దరు పిల్లలనూ అనాథలను చేసింది ఈ లావణ్య.
ఇవీ చదవండి: విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో దారుణం... 30 గంటలకుపైగా మానసిక వికలాంగురాలిపై అత్యాచారం
Sexual assault: విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో దారుణం... బాలికపై ఒప్పంద ఉద్యోగి ఘాతుకం