Low pressure in Bay of Bengal: వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆగస్టు 7న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాల మీదుగా ఉన్న తుపాను ప్రసరణ.. గురువారం పశ్చిమ బంగాళాఖాతం, ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తుకు విస్తరించి ఉందని వివరించారు. వీటి ప్రభావంతో రాష్ట్రంలో కోస్తా, రాయలసీమల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షం, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. మిగిలినచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురుస్తాయన్నారు.
చీమలపాడులో 11.8 సెం.మీ వర్షం: బుధవారం ఉదయం 8.30 నుంచి గురువారం ఉదయం 8.30 గంటల మధ్య.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య, వైయస్సార్, జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గురువారం ఉదయం 8.30 నుంచి రాత్రి 9 గంటల మధ్య.. ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం చీమలపాడులో అత్యధికంగా 11.8 సెం.మీ వర్షం పడింది. నంద్యాల జిల్లా జలదుర్గంలో 6.9, శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో 6.6, అన్నమయ్య జిల్లా రాయచోటిలో 6.5, తిరుపతి జిల్లా పుత్తూరులో 6.5, ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలో 6.1, అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోనలో 6.0 సెం.మీ వర్షపాతం నమోదైంది.
ఇవీ చదవండి: