విశాఖ జిల్లా పెందుర్తిలో శిరోముండనం కేసులో నిందితులకు జనసేనతో గానీ, పవన్ కల్యాణ్‌తో గానీ సంబంధం లేదని... ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శివశంకర్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఆ కేసులో నిందితులుగా ఉన్నవారు జనసేన పార్టీలో కనీసం సభ్యులు కూడా కాదని పేర్కొన్నారు. అతను జనసేనలో ఉన్నారని, పవన్ అభిమాని అని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.
ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంఘటనలో పవన్ కల్యాణ్ పేరు తీసుకురావడం సరికాదని శివశంకర్ అభిప్రాయపడ్డారు. పవన్ అన్యాయానికి కొమ్ము కాసే నేత కాదని అందరికీ తెలుసన్నారు. అన్యాయం ఎక్కడ జరిగినా జనసేన వ్యతిరేకిస్తుందని... బాధితులకు బాసటగా నిలుస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎస్సీలపై జరిగిన అకృత్యాలపై పవన్ గట్టిగా వ్యతిరేకించిన విషయం గుర్తు చేశారు.
పవన్‌కల్యాణ్‌కు లక్షలాది మంది అభిమానులు ఉన్నారని... నిందితుడు ఆయన అభిమాని అయినంత మాత్రాన ఇలాంటి ఘటనలో ఆయన పేరు తీసుకురావడం గర్హనీయమన్నారు. ఈ కేసులో తగిన విచారణ జరిపి దోషులను చట్టపరంగా శిక్షించాలని జనసేన కోరుతోందన్నారు శివశంకర్. పార్టీని గానీ, పవన్ పేరుని గానీ అనవసరంగా ప్రస్తావిస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండీ... 'శిరోముండనం ఘటనలో నూతన్ నాయుడు భార్యపై కేసు నమోదు'