ఎడతెరిపిలేని వర్షాలతో సహజసిద్ధంగా ఏర్పడిన జలపాతాలు ప్రకృతి అందాలతో కళకళలాడుతున్నాయి. ప్రకృతి రమణీయతతో పరవళ్లు తొక్కుతూ మధురానుభూతులను మిగుల్చుతున్నాయి. ప్రచారానికి దూరంగా ఉన్న ఈ జలపాతాలు.. సరికొత్త సోయగాలతో కట్టిపడేస్తున్నాయి. తెలంగాణ నయాగరా జలపాతంగా ఖ్యాతి గడించిన బొగత జలపాతం జలసవ్వడులతో సందడి చేస్తోంది. ములుగు జిల్లా వాజేడు మండలంలోని జలపాతం.. ఉప్పొంగి ప్రవహిస్తోంది. ములుగు జిల్లాతో పాటు ఎగువన వర్షాలు తోడవడంతో జలధారలతో కనువిందు చేస్తోంది.
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయికల్ జలపాతం సైతం జలకళను సంతరించుకుంది. కొండల పైనుంచి జాలువారుతోన్న ప్రవాహంతో ఆహ్లాదం పంచుతోంది. ఏటా జులై చివరి నాటికి జలకళను సంతరించుకునే ఈ జలపాతం.. ఈసారి కాస్త ముందుగానే పరవళ్లు తొక్కుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో దంచికొడుతున్న వర్షానికి కుంటాల జలపాతం ప్రవాహంతో ఉరకలెత్తుతోంది. నెరడిగొండ మండలంలోని ఈ జలపాతం.. చుట్టూ పచ్చని చెట్ల మధ్య పరవళ్లు తొక్కుతోంది. పొచ్చెర జలపాతం జోరు వానతో కొత్త అందాలు సంతరించుకుంది.
కట్టిపడేస్తున్న అందాలు..: మహబూబాబాద్ జిల్లా బయ్యారంలోని పెద్ద గుట్ట జలపాతం దిగువకు ఉరకలెత్తుతోంది. పైనుంచి జాలువారుతున్న ప్రవాహం ప్రజలను ఆకట్టుకుంటోంది. దీంతో ప్రకృతి ప్రేమికులు నీళ్ల కింద కేరింతలు కొడుతూ ఆహ్లాదంగా గడుపుతున్నారు. భీమునిపాదం, ఏడు బావుల జలపాతం అందాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. ప్రకృతి రమణీయతో భీమునిపాదం జలపాతం మధురానుభూతులను మిగులుస్తోంది. పరవళ్లు తొక్కుతున్న నీటి కింద ప్రజలు సేదతీరుతున్నారు.
ఇవీ చూడండి :