కృష్ణా నది, గోదావరి నదీ యాజమాన్య బోర్డు పరిధిని కేంద్రం నోటిఫై చేసిందని జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామల రావు తెలిపారు. విభజన చట్టం ప్రకారం జూన్ 2, 2014 నుంచి 60 రోజుల్లోనే నోటిఫై చేయాల్సి ఉందన్న ఆయన.., వాటి పరిధికి సంబంధించిన నోటిఫికేషన్ రాలేదు కాబట్టే రెండు తెలుగు రాష్ట్రాలు నీటి విడుదలకు సంబంధించి ఒప్పందం చేసుకున్నాయన్నారు. ఈ ఏడేళ్ళలో ఎలాంటి వివాదాలు లేవని తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి కేవలం సాగునీటికి అవసరం ఏర్పడినప్పుడే చేయాలన్నారు. కానీ 45 రోజుల నుంచే ఎలాంటి ఇండెంట్ లేకుండా, కేఆర్‌ఎంబీ ఆదేశాలు లేకుండా తెలంగాణ.. విద్యుత్ ఉత్పత్తి చేసిందని వివరించారు.
అందుకే సుప్రీంను ఆశ్రయించాం..
శ్రీశైలం నుంచి 29 టీఎంసీల నీరు విద్యుత్ ఉత్పత్తి కోసం వాడేశారని.. దీనివల్ల పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తీసుకోలేని పరిస్థితి నెలకొందని శ్యామలరావు చెప్పారు. పులిచింతల వద్ద కూడా విద్యుత్ ఉత్పత్తి కోసం వాడిన 8 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలోకి విడిచి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్.. ప్రధానికి లేఖ రాశారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వేటినీ పట్టించుకోలేదని, అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించామన్నారు.
'తాజాగా కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన గెజిట్‌ను స్వాగతిస్తున్నాం. బేసిన్ పరిధిలో లేని ప్రాజెక్టులు కూడా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వాటిని సవరించాల్సి ఉంది. వెలిగొండ లాంటి ప్రాజెక్టుకు అనుమతి లేని ప్రాజెక్టుగా చూపించటంలో అక్షర దోషాలు దొర్లాయి. వాటిని సవరించాల్సిందిగా కేంద్రాన్ని కోరుతాం'- జె.శ్యామల రావు, జలవనరుల శాఖ కార్యదర్శి
ఏపీ హక్కులను కాపాడుతుంది: ఈఎన్సీ నారాయణ రెడ్డి
కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ ఏపీ హక్కులను కాపాడుతుందని జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి ఆకాంక్షించారు. నోటిఫికేషన్‌లోని చిన్న చిన్న తప్పిదాలను సరి చేయాలని కేంద్రాన్ని కోరతామన్నారు. కేఆర్ఎంబీ కార్యాలయాన్ని ఏపీలోనే ఏర్పాటు చేయాలని విభజన చట్టంలోనే ఉందన్న ఆయన.., దాని ప్రకారం ఏపీలోనే కేఆర్ఎంబీ కార్యాలయం ఏర్పాటవుతుందన్నారు. దిగువ రాష్ట్రంగా ఏపీలోని కొన్ని ప్రాజెక్టులనూ బోర్డు పరిధిలోకి తీసుకురావడం అనవసరమని వ్యాఖ్యానించారు. రాయలసీమ ఎత్తిపొతల పథకాన్ని నోటిఫై చేస్తే ఒక రకమైన లాభం.. చేయకుంటే మరో రకమైన లాభం ఉందని నారాయణ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి
Ministry of Jal Shakti: విభజన చట్టం ప్రకారమే ఇరు రాష్ట్రాల మధ్య నీటి వాటా: జల్‌శక్తి శాఖ