Struggle with Drinking Water in Villages: గుక్కెడు గంగ దొరక్క పల్లె ప్రజల గొంతెండిపోతోంది. దాహార్తి తీరే దారిలేక జనం డబ్బాలు కట్టుకుని, బిందెలు పట్టుకుని చెలమలు, బావుల వెంట పరుగులెత్తాల్సిన దుస్థితి దాపురించింది. బీదా బిక్కీ కూడా నెలకు ఆరేడు వందల రూపాయలు ఖర్చు పెడితే తప్ప గొంతు తడిచే దారి లేని దైన్యం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో పల్లెల్లో తాండవిస్తోంది. నీటికొరత తీరుస్తామని హామీలిచ్చిన నేతలు గద్దెనెక్కాక జనం గోడు పట్టించుకోక.. ఊటచెలమల్లో, బావుల్లో రంగు మారిన, పాచిపట్టిన నీరే దిక్కవుతోంది. తాగునీరందించే బోర్లు, రక్షిత పథకాలు ఏళ్ల తరబడి పనిచేయకున్నా.. నిధుల్లేకపోతే మేమేం చేస్తామంటూ గ్రామీణ నీటిసరఫరా విభాగం ఉత్త చేతులు చూపిస్తోంది. ఈ నెల 16 నుంచి 18 వరకు మూడు రోజులపాటు రాష్ట్రంలోని 24 జిల్లాల్లో ఒక్కో గ్రామాన్ని ‘ఈనాడు’ బృందం పరిశీలించినప్పుడు ప్రజలు తాగునీటికి పడుతున్న అవస్థలన్నీ కళ్లకు కట్టాయి.
- పరిశీలించిన మొత్తం గ్రామాలు 24. వాటిలో...
- ప్రైవేట్ ఆర్వో ప్లాంట్లపై ఆధారపడుతున్న గ్రామాలు 10
- వ్యవసాయ బావులపై.. 5
- గెడ్డలపై.. 2
- నదుల్లో చెలమలపై 1
- పక్క గ్రామాలపై.. 1
- ట్యాంకర్ల నీరే దిక్కయినవి 2
- అరకొరగా రక్షితనీరు అందుతున్నవి 3
- ఆర్వో ప్లాంట్లపై ఆధారపడుతున్న కుటుంబాలు85,736
- వీరు నీళ్ల కోసం నెలకు చేస్తున్న ఖర్చు రూ.74,39,250
నిధుల మళ్లింపుతో నీరసించిన పంచాయతీలు: రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని 36,917 రక్షిత తాగునీటి పథకాల నిర్వహణ గ్రామ పంచాయతీలదే. సాధారణ నిధులు అందుబాటులో లేని చోట ఆర్థిక సంఘం నిధులతో ప్రజలకు వేసవిలో తాగునీటికి ఇబ్బంది లేకుండా సర్పంచులు చూసేవారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధులు దాదాపు రూ.900 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీల బకాయిలకు మళ్లించింది. దీంతో ఈ వేసవిలో తాగునీటి పథకాల నిర్వహణపై చాలా గ్రామ పంచాయతీలు చేతులెత్తేశాయి.
సమగ్రనీటి పథకాలకు అత్తెసరు నిధులు : గ్రామాల్లో కీలకమైన సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణకు ప్రభుత్వం అరకొరగానే నిధులిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 591 పథకాలకు నెలకు దాదాపు రూ.36 కోట్లు అవసరమని అంచనా. ఇప్పటికే రూ.150 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. పథకాల నిర్వహణను చూస్తున్న ప్రైవేట్ సంస్థలు బిల్లులు అందక సిబ్బందికి సకాలంలో జీతాలు చెల్లించడం లేదు. దీంతో ఈ ఏడాది కొన్ని రోజులపాటు సత్యసాయి జిల్లాలో సిబ్బంది విధులు బహిష్కరించారు. దీంతో 600 గ్రామాలకు సత్యసాయి తాగునీటి పథకం నుంచి సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రభుత్వం కొన్ని పెండింగ్ బిల్లులు చెల్లించింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, కృష్ణా, ప్రకాశం, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లోనూ సమగ్ర రక్షిత తాగునీటి పథకాల నిర్వహణ బిల్లులు రూ.40 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయి.
40 ఏళ్లుగా రోజూ 3 కి.మీ. నడక -కృష్ణా జిల్లా: తాగునీటి కోసం నలభై ఏళ్లుగా నిత్యం 3కిలోమీటర్లు కాలినడకన వెళుతున్నానంటున్న ఈ మహిళ పేరు తులశమ్మ, ఊరు కృష్ణా జిల్లా ఘంటసాల మండలం ఎండకుదురు పంచాయతీ పరిధిలోని జీలగలగండి కాలనీ. కాలనీలోని 700 మంది ప్రజలు ఊరికి 3 కి.మీ. దూరాన పొలాల్లోని బావిలోని తాగునీటిని కాలినడకన వెళ్లి తెచ్చుకుంటున్నారు. మూడేళ్ల కిందట రక్షితనీటి ట్యాంకు నిర్మించినా పైప్‌లైన్లు సరిగా లేక నిరుపయోగంగా మిగిలింది.
ఆ ఊరికి ఏడాదికి రూ.32 లక్షలు వదులుతోంది :పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం రేమిడిచర్లలో చేతి పంపులకు నీరందే పరిస్థితి లేదు. దీంతో పొలాల్లోని వ్యవసాయ బోర్ల నుంచి ఊళ్లోకి గొట్టపు మార్గాల ద్వారా నీరు సరఫరా చేసి ప్రైవేటు కనెక్షన్ల ద్వారా ప్రజలకు అందిస్తున్నారు. ఇందుకు ఒక్కో కుటుంబం నెలకు రూ.600 చొప్పున చెల్లించాలి. మొత్తం 450 కుటుంబాలు.. ఏడాదికి రూ.32 లక్షలు నీటి కోసమే ఖర్చు చేయాల్సి వస్తోంది.
ప్రైవేటు నీటి కనెక్షన్‌కు ఏడాదికి ముందస్తుగా రూ.7200 కట్టాను. రోజు అరగంట నీళ్లు వదులుతారు. వాటినే జాగ్రత్తగా వాడుకుంటున్నాం. - రొడ్డా నాగిరెడ్డి, రేమిడిచర్ల,
నిర్వహణ నిధులివ్వక పథకం మూలకు: తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాల్లోని 125 గ్రామాల్లో 4 లక్షల మందికి.. తాగునీరు అందించేందుకు సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.150 కోట్లతో పథకం నిర్మించారు. దీని నిర్వహణను ప్రభుత్వం ఎల్‌అండ్‌టీకి అప్పగించినా నిధులివ్వడం లేదు. రూ.1.20 కోట్ల బకాయి పడటంతో వేతనాలందక సిబ్బంది విధులకు రావడం లేదు. ఏడాదిగా నీటి సరఫరా నిలిచిపోయింది. డబ్బా నీళ్లు కొనుక్కోవడానికి కుటుంబానికి నెలకు రూ.800 వరకూ ఖర్చవుతోంది.
మూలనపడి 300 రోజులు, ఏలూరు జిల్లా:
ఏలూరు జిల్లాలోని 275 పల్లెలకు తాగునీరందించే సత్యసాయి రక్షిత నీటి పథకం మూలనపడి 300 రోజులవుతోంది. పోలవరం మండలం వింజరం పంచాయతీ పరిధిలోని బక్కబండారుగూడెంలోని 200 మంది గిరిజనులకు ఈ పథకమే దప్పిక తీర్చేది. పథకం పనిచేయక 5 కి.మీ. దూరంలోని ఆర్వో ప్లాంట్‌కు వెళ్లి 20 లీటర్ల డబ్బా నీటిని రూ.10కి కొని తెచ్చుకుంటున్నారు. నెలకు 30 క్యాన్లకు రూ.300 అవుతుంటే.. ద్విచక్రవాహనానికి పెట్రోలు ఖర్చు రూ.400 దాటుతోంది.
గ్రామంలో రక్షిత మంచినీటి పథకం పది నెలలుగా మూలనపడింది. నీళ్ల కోసం రోజూ ఐదు కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోంది. - కన్నపురాజు, బక్కబండారుగూడెం
- గుంటూరు జిల్లా: పెదకాకాని మండలం వెంకటకృష్ణాపురంలో రక్షితనీటి పథకం ఉన్నా చెరువులో నిల్వ ఉన్న నీరు పచ్చగా మారి శుద్ధి కావడం లేదు. ఫిల్టర్ బెడ్లను 20 ఏళ్లుగా బాగు చేయకుండా వదిలేశారు. దీంతో పంచాయతీ సరఫరా చేస్తున్న నీటిని తాగలేక 2 కి.మీ.దూరంలోని ఉప్పలపాడు గ్రామంలో కుళాయి నుంచి డబ్బాలతో తాగునీరు తెచ్చుకుంటున్నారు.
నీళ్ల ఖర్చు నెలకు రూ.600
పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులోని సమగ్ర రక్షిత మంచినీటి పథకం నుంచి శేరేపాలెం ఓహెచ్‌ఆర్‌కు ఏర్పాటు చేసిన సరఫరా పైపులైను నుంచి గ్రామానికి సరిగా నీరందడం లేదు. సుమారు 3వేల మంది ప్రజలున్న ఈ గ్రామంలో భూగర్భజలాలు వినియోగించడానికి పనికిరావు. కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్న నీరే ఆధారం. అదీ సక్రమంగా రాక ప్రజలు మొగల్తూరులోని నీటిశుద్ధి కేంద్రం నుంచి తెచ్చుకుంటున్నారు. ఇందుకు ఒక్కో కుటుంబం నెలకు సుమారు రు.600 వరకూ వెచ్చిస్తోంది.
- కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలోని డి.కోటకొండది మరో కన్నీటి గాథ. ఇక్కడ మూడు నీటి పథకాలున్నా.. తాగడానికి పనికొచ్చేది ఒకటే. భూగర్భ జలాలు అడుగంటి చేతిబోర్లు పని చేయడం లేదు. అధికారులు కనీసం ట్యాంకర్లతోనైనా నీళ్లందించడం లేదు. దీంతో గ్రామంలోని 2,500 మంది దూరంగా ఉన్న వ్యవసాయ బావుల్లోని నీటిని తెచ్చుకుంటున్నారు. ఒకేసారి 8 బిందెల నీళ్లు తెచ్చుకునేలా ఇంటికో రెండు చక్రాల బండి తయారుచేయించుకున్నారు.
- బాపట్ల జిల్లాలోని నిజాంపట్నంలో రక్షితపథకం అరకొర నీటినే అందిస్తోంది. భూగర్భ జలాలు అడుగంటడం, చుట్టూ రొయ్యల చెరువులు కావడంతో.. ప్రజలు తాగునీటిని కొనుక్కుని తాగాల్సి వస్తోంది. ఆర్వో ప్లాంటు అందుబాటులో లేని వారు మూడు కిలోమీటర్ల దూరం పోయి పొలాల్లోని చేతిపంపులు, బావుల నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు.
- కోనసీమ జిల్లా: పది వేలకుపైగా జనాభాతో గోదావరి చెంతనున్న కోనసీమ జిల్లా కపిలేశ్వరపురంలో ఆరు నెలలుగా తాగునీరు అందడం లేదు. మూడు దశాబ్దాల క్రితం 1.5 లక్షల లీటర్ల సామర్థ్యంతో నిర్మించిన ట్యాంక్ శిథిల స్థితికి చేరింది. అందులోనే 50 శాతం నీటిని మాత్రమే నింపగలగడంతో ప్రజలకు పూర్తిస్థాయిలో తాగునీరు అందడం లేదు.
- అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం కంపుమానుపాకలలో అరవై పైగా ఆదివాసీ కుటుంబాలకు ఏళ్ల తరబడి సమీపంలోని గెడ్డల నీరే ఆధారం. ఎన్నో వినతులు, అభ్యర్థనలు, కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగితే నాలుగేళ్ల కిందట మంచినీటి పథకం మంజూరైంది. ఎస్‌డీపీ సీఎం నిధులతో ట్యాంకు, వీధి కుళాయిలు నిర్మించి ప్రారంభించినా.. పది రోజుల్లోనే మోటారు పాడై నీటి సరఫరా నిలిచిపోయింది.
- అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం చెన్నముక్కపల్లెలో 2008లో అప్పటి ప్రభుత్వం రూ.13.35 లక్షల నిధులతో నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటైన కేంద్రం.. గంటకు 4 వేల లీటర్ల నీటిని శుద్ధి చేసి అందిస్తుండగా... అప్పట్లో ఐదేళ్ల పాటు పని చేసి తర్వాత మూతపడింది. విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడం, కేంద్రం నిర్వహణ లేక నిరుపయోగంగానే ఉంది. రూ.లక్షల విలువైన పరికరాలు తుప్పుపట్టి పనికిరాకుండా పోతున్నాయి. తాగునీటిని ప్రైవేటు ట్యాంకర్లు గ్రామానికి సరఫరా చేస్తుండగా రూ.15 చెల్లించి బిందె నీటిని పట్టుకుంటున్నారు. గ్రామంలో నిత్యం 200 బిందెల వరకు కొనుగోలుకు రూ.3 వేల వరకు చెల్లించాల్సి వస్తోంది.
- పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం పనసభద్ర పంచాయతీ మెండంగిలో రక్షితనీటి పథకం పైపులైన్లు దెబ్బతినడంతో సరఫరా ఆగిపోయింది. ఇంటింటికీ కుళాయి పథకంలో చేపట్టిన పనులు నిధుల కొరతతో నిలిచిపోయాయి. కొండపై ఉండటంతో ట్యాంకర్లతోనూ నీరందించలేరు. బోర్లు కూడా లేక కి.మీ. దూరంలోని మందపాక ఊట గెడ్డపై ఆధారపడుతున్నారు. వర్షాకాలం రంగుమారిన నీళ్లొస్తున్నా అవే తాగుతున్నారు.
- నెల్లూరు జిల్లా బిట్రగుంట పంచాయతీ పరిధిలోని తెల్లగుంట వాసులు గుక్కెడు నీటి కోసం పాతికేళ్లుగా పోరాడుతున్నారు. అక్కడున్న 265 కుటుంబాలవారు గతేడాది ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలనూ బహిష్కరించేందుకూ సిద్ధమయ్యారు. నెలలోపే సమస్య తీరుస్తామని రాసిచ్చి, ఓటింగ్‌కు రప్పించిన అధికారులు.. తర్వాత కన్నెత్తి చూడలేదు. ట్యాంకర్లతో రోజూ 10 ట్రిప్పులు సరఫరా చేస్తున్నా చాలక ప్రజలు 20 లీటర్ల తాగునీటిని రూ.12 చొప్పున కొనుక్కోవాల్సి వస్తోంది. నాలుగేళ్ల క్రితం చేపట్టిన నీటి పథకం, ఎన్టీఆర్ సుజల పూర్తయి ఉంటే మండలంలోని 50 వేల మంది దాహం తీరేది.
- ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం చినారికట్లలోని రక్షిత తాగునీటి పథకం 15 ఏళ్లుగా పని చేయడం లేదు. ట్యాంకర్ల ద్వారా అందే నీరు చాలక దాదాపు 1500 కుటుంబాలవారు స్థానిక ఆర్వో ప్లాంటు నుంచి క్యాన్ రూ.10 చొప్పున కొనుక్కుంటున్నారు. మరో 100 కుటుంబాలవారు కి.మీ. దూరంలోని సొంత బోరుబావుల నుంచి తెచ్చుకుంటున్నారు. వేసవిలో నీటి ఎద్దడి దృష్ట్యా గ్రామస్థులు కొందరు జనవరిలోనే తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు వలస కూలీలుగా వెళుతున్నారు.
- సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలంలోని పైపేడులో 100 కుటుంబాలకు కొన్నేళ్లుగా తాగునీటి ఇబ్బందులే. 2011లో సత్యసాయి తాగునీటి పథకం కింద రూ.2.50 లక్షలతో ట్యాంకు నిర్మించారు. గ్రామం కొండల మధ్యలో ఉండటంతో గొల్లపల్లి సత్యసాయి పంపుహౌస్ నుంచి నీరు సరఫరా అయ్యే పైప్‌లైన్ దెబ్బతింది. పన్నెండేళ్లుగా సరఫరా లేదు. వైఎస్సార్ జలకళ కింద రెండు బోర్లు వేయిస్తే ఒకదానిలో మాత్రమే రోజుకు గంటసేపు నీళ్లొస్తున్నాయి. కి.మీ. దూరంలోని పాచిపట్టి రంగుమారిన చెలమబావి జలాన్నే తాగుతున్నారు.
- అనకాపల్లి జిల్లా నక్కపల్లి జనాభా సుమారు పది వేలు. ఇక్కడ మూడు ట్యాంకులు నిర్మించినా నీరు అందుబాటులో లేక.. ఎస్.రాయవరం మండలం చినగుమ్ములూరు ప్రాజెక్టు నుంచి సరఫరా చేస్తున్నారు. విద్యుత్తు కోతలతో పాటు, బోరుకు సరిపడా నీరు రాకపోవడంతో రెండు రోజులకోసారి ఇవ్వాల్సిన నీటిని వారంలో ఒక్కసారే ఇస్తున్నారు. నెల రోజుల నుంచి నీటి సరఫరా అస్తవ్యస్తంగా తయారైందని గ్రామస్థులు ఎ.నాగమణి, వసంతలక్ష్మి వాపోయారు.
ఇదేం ప్రణాళిక? :ఏటా వేసవిలో నీటి ఎద్దడి తలెత్తే మండలాలను ముందుగా గుర్తించి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రణాళిక రూపొందిస్తారు. 2022కు రూ.42.54 కోట్లతో గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. వేసవి దాదాపు పూర్తవుతున్నా ఇప్పటికీ చాలా మండలాలకు నిధులు విడుదల కాలేదు. కొన్ని జిల్లాల్లో ట్యాంకర్లతో నీళ్లు సరఫరా చేసే గుత్తేదారులకు రూ.లక్షల్లో బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రకాశం, కర్నూలు, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో చాలాచోట్ల నిరుడు నీళ్లు సరఫరా చేసిన గుత్తేదారులకు బిల్లులు ఇవ్వలేదు. నిధుల కొరతతో ఈ ఏడాది పలు జిల్లాల్లో భూగర్భ జలాలు అడుగంటిన బోర్లు లోతు తవ్వే (ఫ్లస్సింగ్, డీపింగ్) పనులు కూడా చేపట్టలేదు.
ఇదీ చదవండి: