Hyderabad biryani with organic rice : హైదరాబాద్ ధమ్‌కా బిరియానీని దేశ విదేశీయులు ఎంతో ఇష్టపడి తింటారు. పొడవైన గింజ, సువాసన గల బాస్మతి బియ్యానికి మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంటుంది. తెలంగాణ వరంగల్ జిల్లా రాయపర్తి మండలం గన్నారం గ్రామానికి చెందిన రైతు ఒంటెల విశ్వేశ్వర్‌రెడ్డి సేంద్రియ విధానంలో బాస్మతి బియ్యాన్ని పండిస్తూ.. కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. ఈయన ప్రాణహిత, నవారా, కృష్ణవేహి లాంటి రకాల బియ్యంతో పాటు 8 ఎకరాల్లో మామిడి తోట, పసుపు, పెసలు, కందులను ప్రకృతిహితంగా సాగు చేస్తున్నారు. వరంగల్, హైదరాబాద్‌లో ఉండేవారు విశ్వేశ్వర్‌రెడ్డి వద్ద వీటిని కొనుగోలు చేస్తారు.
ఒకప్పుడు తాను కూడా రసాయన ఎరువులతో సాగు చేసేవాడినన్నారు. తన తల్లి క్యాన్సర్‌తో కన్నుమూయడంతో ప్రకృతి సేద్యంవైపు మళ్లానని చెబుతున్నారు. ఇప్పుడు పండించిన బాస్మతి బియ్యం ధర కిలో రూ.200 వరకు పలుకుతుందని విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు.
సాగులో లాభం కన్నా.. తన పంటల వల్ల 10 మంది ఆరోగ్యంగా ఉంటారనే సంతృప్తే ఎక్కువని ఈ ప్రకృతి రైతు చెబుతున్నారు.