సంక్షేమ పథకాలకు రుణాలివ్వడం లేదంటూ కృష్ణా జిల్లాలో బ్యాంకుల ముందు చెత్త పారబోసిన ఘటనపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంది. ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్ ఎన్.ప్రకాశ్‌రావును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఘటనపై విచారణ అనంతరం రాష్ట్ర మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు. తక్షణం ఆయన్ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు హెడ్‌క్వార్టర్ విడిచి వెళ్లొద్దని ఆదేశించారు. గుడివాడ మున్సిపాలిటీ సహాయ కమిషనర్‌గా ఉన్న టి.వి.రంగారావుకు.. ఉయ్యూరు కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
కేంద్రం సీరియస్
కృష్ణా జిల్లా మచిలీపట్నం, విజయవాడ, ఉయ్యూరులోని కొన్ని బ్యాంకుల ఎదుట ఈనెల 24న చెత్త పారబోశారు. స్థానిక అధికారుల ఆదేశాల మేరకే చెత్త వేసినట్లు తెలుసుకున్న బ్యాంకర్లు... దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. కారకులపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఆల్ ఇండియా బ్యాంకు అధికారుల కాన్ఫెడరేషన్... కృష్ణా జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసింది. అదేరోజు సాయంత్రం విజయవాడలో జరిగిన సమావేశంలో ప్రభుత్వ అధికారుల తీరుపై బ్యాంకర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినందున... కేంద్ర ప్రభుత్వమూ స్పందించింది. ఘటనపై విచారణ జరిపి కారకులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్... రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి సూచించారు.
కమిషనర్ ప్రమేయం..!
బ్యాంకుల ముందు చెత్త వేయడానికి కారకులైన వారిపై విచారణ జరిపిన ఉన్నతాధికారుల బృందం... ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్ ప్రమేయం ఉన్నట్లు తేలినందున సస్పెండ్ చేసింది. సస్పెన్షన్‌కు ముందు మాట్లాడిన ఎన్.ప్రకాశ్ రావు.. పారిశుద్ధ్య కార్మికులు, లబ్ధిదారులే చెత్త వేశారని చెప్పారు.
ఇంకా బాధ్యులంటే చర్యలు
విజయవాడ, మచిలీపట్నంలోనూ పలు బ్యాంకుల ముందు అదేరోజున చెత్త పారబోశారు. దీనిపై ఆయా మున్సిపల్ కమిషనర్ల నుంచి ప్రభుత్వం వివరణ కోరింది. ప్రస్తుతం విచారణ జరుగుతున్నట్లు... బ్యాంకర్లకు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. ఇంకా ఎవరైనా బాధ్యులున్నట్లు తేలితే వారిపైనా చర్యలు తీసుకుంటామని అఖిల భారత బ్యాంకు అధికారుల సంఘానికి లేఖ రాశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించేలా బ్యాంకర్లు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: