expulsion of the priest : పెళ్లి... మానవ జీవితంలో ఓ ప్రధానమైన ఘట్టం. సంతోషాలు, సంబంధాలతో పాటు ఎన్నో ఇబ్బందులు, ఖర్చులు ముడిపడి ఉన్న వేడుక ఇది. మనిషికి నీడనిచ్చేది ఇల్లయితే.. తోడు నిచ్చేది పెళ్లి. అందుకే ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అంటారు. హిందూ సంప్రదాయంలో మనిషి పుట్టుక మొదలు.. చివరి వరకు పౌరోహిత్యానిది కీలకపాత్ర.. వాటిలో ప్రధానంగా పెళ్లి . అంతటి కీలక పాత్ర కాబట్టే ఓ పురోహితుడు భారీ ఆదాయం ఆర్జించాలనుకున్నాడు. సంభావన పేరుతో దండుకుంటూ.. ఇవ్వకుంటే శాపనార్థాలు పెడుతూ ఊరికి భారంగా మారాడు. ఇన్నాళ్లు అతడి వసూళ్లు భరించిన ప్రజలు విసిగిపోయి ఈ పురోహితుడు మాకొద్దు అంటూ గ్రామసభ పెట్టి మరీ ముక్త కంఠంతో డిమాండ్ చేశారు.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం బంజర్పల్లిలో బుధవారంనాడు గ్రామస్థులంతా ఆంజనేయ స్వామి గుడి వద్ద గ్రామసభ నిర్వహించారు. అదేదో గ్రామాభివృద్ధికి సంబంధించిన సభ అనుకుంటే పొరపాటే.. ఆ మీటింగ్ ఉద్దేశం.. ఆ ఊళ్లో సంభావన పేరుతో దండుకుంటున్న అయ్యవారి ఆగడాల్ని అరికట్టడం కోసం.
గ్రామంలో పౌరోహిత్యం చేస్తున్న ఓ వ్యక్తి ప్రజల నుంచి సంభావన పేరుతో దండుకుంటున్నాడు. పెళ్లి, గృహప్రవేశం సహా వేడుక ఏదైనా అతని బాదుడు భారీగా ఉంటుందని ప్రజలంతా ఏకరవు పెట్టారు. పెళ్లి చేయాలంటే తులం బంగారంతో పాటు, వధూవరుల కుటుంబాల నుంచి రూ.25 వేల చొప్పున వసూలు చేస్తున్నాడు. గృహ ప్రవేశం అయితే అరతులం బంగారం సంభావనగా ఇచ్చుకోవాల్సిందే. పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా ఎవరింటికి ఏ కార్యానికి వెళ్లాలన్నా భారిగా సమర్పించుకోవాల్సిందేనంటూ గ్రామస్థులతో పాటు బాధితులు ఆవేదన వెళ్లగక్కారు.
మా గ్రామానికి పౌరోహిత్యం చేస్తున్న ఓ వ్యక్తి సంభావన పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడుతున్నాడు. గత ఐదేళ్లుగా అతడి ఆగడాలు భరిస్తూ వచ్చాం. అతడి ఆగడాలతో విసుగిన గ్రామస్థులంతా ఏకమై.. గ్రామసభ నిర్వహించి.. ఆ అయ్యవారు మాకొద్దు అన్ని తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని పురోహితుల సంఘానికి, రూరల్ పోలీస్స్టేషన్లోను అందించడం జరిగింది. -శంకర్, గ్రామ సర్పంచ్
అడిగినంత సంభావన ఇవ్వమంటే పౌరోహిత్యానికి రానని.. ఒకవేళ వచ్చిన తర్వాత తక్కువ ఇస్తే శాపనార్థాలు పెడుతున్నాడని గ్రామస్థులు ఆరోపించారు. ఎవరింట్లోనైనా అశుభం జరిగితే అది తన శాపంతోనే జరిగిందని చెబుతూ భయపెడుతున్నాడని ఆరోపిస్తున్నారు. తనను కాదని బయటి నుంచి వచ్చి ఎవరూ పౌరోహిత్యం చేయరని బెదిరిస్తున్నాడని అంటున్నారు.
ఊళ్లో ఎవరి ఇంట్లో అయినా శుభకార్యానికి పిలిస్తే భారీగా సంభావన అడుగుతున్నాడు. ఇవ్వకపోతే అశుభం జరుగుతుందని శాపనార్థాలు పెడుతున్నాడు. పెళ్లికి తులం బంగారం, రూ.50 నగదు ఇలా ప్రతి దానికి ఇంతని చొప్పున వసూలు చేస్తున్నాడు. అందుకే ఆ అయ్యవారు వద్దని గ్రామంలోని అన్ని కుల సంఘాలవారు తీర్మానం చేశాము. గ్రామ పెద్దలు.
పురోహితుడి ఆగడాలతో విసుగుపోయిన గ్రామస్థులు ఈ అయ్యవారు తమ గ్రామానికి అవసరం లేదని.. ఆ పురోహితుడిని ఎవరూ పిలవొద్దని తీర్మానం చేశారు. అతడిని ఎవరూ ఆహ్వానించమంటూ ప్రతిజ్ఞ చేశారు. ప్రజలు ఇంతలా విసిగిపోయారంటే ఆ అయ్యవారి సంభావన బాదుడి మామూలుగా లేదని తెలియకనే తెలుస్తోంది కదూ..
ఇదీ చూడండి: LAND SCHEME TO JUDICIAL PREVIEW: జ్యుడీషియల్ ప్రివ్యూకు.. రాష్ట్ర భూహక్కు-భూరక్ష పథకం