National Sanskriti Mahotsav: స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతోన్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జాతీయ సాంస్కృతి మహోత్సవాలను వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేశారు. తెలంగాణలోని హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతీయ సంస్కృతిని కాపాడటమే జాతీయ సంస్కృతి మహోత్సవం ఉద్దేశమని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. ప్రపంచంలోనే భారతదేశం సూపర్ శక్తిగా ఎదుగుతోందన్నారు. సంగీతం, చిత్రలేఖనం లాంటి కళలకు ప్రోత్సాహం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ వ్యవహారాలు మాతృభాషలోనే జరిగేలా ప్రయత్నం చేయాలని.. ఆయన ఆకాంక్షించారు.
హైదరాబాద్ వేదికగా జాతీయ సంస్కృతి మహోత్సవం జరగడం చాలా సంతోషంగా ఉందని.. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. భిన్న సంస్కృతులు, భాషలు భారతదేశాన్ని ఏకం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఘంటసాల వంద సంవత్సరాల ఉత్సవాలు నిర్వహించుకుంటున్నామని.. బాల సుబ్రహ్మణ్యం, సిరివెన్నెలకు నివాళులు అర్పిస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.
సంప్రదాయాలు ఉట్టిపడేలా: మూడు రోజుల పాటు సాగనున్న ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ రాష్ట్రాలకు చెందిన హస్తకళలు, చిత్రకళ, పుడ్ కోర్టు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాలకు చెందిన సాంస్కృతిక, సంప్రదాయాలు ఉట్టిపడేలా కళాకారులు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రముఖ సినీ దర్శకుడు శంకర్ మహదేవన్ సంగీత విభావరి కనువిందుగా సాగింది.
ప్రముఖులకు సన్మానం: రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్‌లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులను సత్కరించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ టి.దశరథరామారెడ్డిని కేంద్రమంత్రి జి కిషన్‌రెడ్డి సత్కరించారు.
ఇదీచూడండి: Raj bhavan Ugadi celebrations: 'నేను శక్తిమంతురాలిని.. నా తలను ఎవరూ వంచలేరు'