పది రోజుల కిందటి వరకు రాష్ట్రంలో పండించిన పంటను కొనే వారు లేక... రోడ్ల పక్కన పారబోసిన టమాటా, వంగ, బెండ, దొండ, బీర తదితరాలకు గిరాకీ పెరిగింది. గులాబ్(GULAB) తుపాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలతో పంటలు కోల్పోయిన, ధరల్లేక పంటల్ని తొలగించిన రైతులు ఇప్పుడు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అదే సమయంలో వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి.
వారం, పది రోజుల్లోనే మారిన చిత్రం
- ‘అయిదున్నర ఎకరాల్లో టమాటా వేస్తే రూ.లక్ష నష్టం వచ్చింది. దాన్ని తొలగించిన తర్వాత ధర పెరగడం మొదలైంది. కొత్తగా వేసిన పంట చేతికొచ్చేసరికి నెల పడుతుంది. అప్పటి వరకు ధరలు ఉంటాయో లేదో?’ అని అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం పాపంపల్లి రైతు చెన్నమల్లప్ప వాపోయారు. ‘మూడెకరాల్లో టమోటా వేస్తే.. ఇప్పటికే అధిక భాగం అమ్మేశా. ఇంకా 300 పెట్టెల వరకు వస్తుందేమో. చివరి దశకు చేరాక మంచి ధర వచ్చింది’ అని మరో రైతు జి.వెంకటేశ్ తెలిపారు.
- ‘రెండెకరాల్లో బీర వేశా. ధర లేక ఇరవై రోజుల కిందట తీసేశా. ఇప్పుడు మంచి ధర వచ్చింది. అయితే పంట లేదు’ అని కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పిల్లిగుండ్ల రైతు గోవిందు నిరాశ వ్యక్తంచేశారు.
- విజయనగరం జిల్లా రామభద్రాపురంలో తుపాను ముందు వరకు 15 కిలోల బెండకు రూ.30 నుంచి రూ.50 లోపు మాత్రమే లభించగా... ఇప్పుడు రూ.300 చొప్పున లభిస్తోంది. వంకాయలకు రూ.400, చిక్కుళ్లకు రూ.300 పైన దక్కుతోంది.
- కర్నూలు జిల్లాలో ఉల్లికి రెండు వారాల కిందటి వరకు క్వింటాకు రూ.వెయ్యి కూడా ధర లేదు. అధికశాతం సరకును రైతులు అమ్మేశాక ధర పెరిగింది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మార్కెట్లో రూ.2,500 నుంచి రూ.2,850పైగా లభిస్తోంది.
- అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వారం రోజుల కిందటి వరకు 15 కిలోల టమాటా(రెండు పెట్టెలు)కు రూ.100 లోపు ధరే లభించింది.
- మంగళవారం నిర్వహించిన వేలంలో గరిష్ఠంగా రూ.970(సుమారు కిలోకు రూ.65) దక్కింది. సగటున రూ.500 నుంచి రూ.700 లభించింది. ఇదే ప్రాంతంలో పది రోజుల కిందటి వరకు ధరల్లేక తోటల్ని వదిలేయడం గమనార్హం.
- విజయవాడ రైతు బజార్‌లో వారం కిందట కిలో టమాటా రూ.19 ఉండేది. మంగళవారం రూ.30 పలికింది. విజయనగరం జిల్లా పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో రూ.45, విశాఖపట్నంలో రూ.40 చొప్పున విక్రయిస్తున్నారు. చిల్లర మార్కెట్లలో కిలో రూ.50 వరకు అమ్ముతున్నారు.
ఇదీ చూడండి: TIRUMALA TIRUPATHI BRAHMOTHSAVALU: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేటి సాయంత్రమే అంకురార్పణ