తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి(Vasalamarri) జనం కష్టాలు తీర్చేందుకు నడుంబిగించారు ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR). దత్తత గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారు. ఏడాదిలో బంగారు వాసాలమర్రిగా మారుద్దామని పిలుపునిచ్చారు. కష్టం చెప్పుకుందామంటే వినే నాథుడేలేని ఈ రోజుల్లో స్వయంగా సీఎం నేనున్నానంటూ రావడం పల్లెవాసుల్లో పండగను తీసుకువచ్చింది. శ్రీమంతుడి సినిమా(Srimanthudu Movie)లాగా జీవితాలు మారనున్నాయని ఈలలు వేస్తూ చప్పట్లు కొట్టి సంతోషం వ్యక్తపరచారు. ముఖ్యమంత్రి మాత్రం కర్తవ్యాన్ని గుర్తు చేస్తూనే వాసాలమర్రి వాసులను ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు.
కష్టం చెప్పుకుందామంటే చిన్నచిన్న నాయకులే కసురుకుంటారు. ఒకే ఊరివాళ్లైనా కొందరు కనీసం తిన్నావా..? ఎలా ఉన్నావ్..? అని పలకరించరు. శుభకార్యాలకు వెళ్తే.. అయినవారికి ఆకుల్లో కానీవారికి కంచాల్లో అన్నట్లు వ్యవహరిస్తారు. అలాంటిది ముఖ్యమంత్రితో భోజనం చేసే అవకాశం రావడం వాసాలమర్రి వాసులను ఉక్కిరిబిక్కిరిచేసింది. పేరుపేరునా పలకరిస్తూ కొసిరికొసిరి వడ్డించడం.. ఆ తర్వాత వేదికపైనా వాళ్లను అడిగి తెలుసుకున్న వివరాలు ప్రస్తావిస్తూ కష్టాల్లో ఉన్నవాళ్లను ఆదుకోవాలని ముఖ్యమంత్రి(CM KCR) చెప్పడం పల్లెవాసులకు కర్తవ్యాన్ని గుర్తు చేసింది.
వాసాలమర్రి(Vasalamarri)లో సహపంక్తి భోజనం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR).. వృద్ధురాలు ఆగమ్మతో ముచ్చటించారు. మంచి, చెడు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆపాయ్యంగా వడ్డించారు. ఆ తర్వాత వేదికపైనా ఇద్దరు మహిళలకు అవకాశం కల్పించారు. ముఖ్యమంత్రిని నేరుగా చూడటం, కలవడం, అందులోనూ మాట్లాడే అవకాశం రావడం చాలా అరుదైన అవకాశం. అలాంటిది పెద్దకొడుకునంటూ వచ్చారని వాసాలమర్రి ఆగమ్మ పట్టరాని ఆనందం వ్యక్తం చేశారు.
ఆగమ్మతో ముచ్చటించిన కేసీఆర్(CM KCR).. ఆమె సమస్యలను తెలుసుకున్నారు. అలాగే ఊర్లోని వాళ్లందరి వివరాలు సేకరించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఆరోగ్య, ఆర్థిక వివరాలు నమోదు చేయాలన్నారు. వాటన్నింటికి పరిష్కారం చూపేలా కార్యాచరణ సిద్ధం చేయాలని వాసాలమర్రికి బాధ్యురాలిగా నియమిస్తూ కలెక్టర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశం చేశారు. ఆగమ్మ సైతం కేసీఆర్‌కు తన కష్టాలు చెప్పుకున్నారు. పెద్దకొడుకులా బాధలు తీరుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
వాసాలమర్రిని ముఖ్యమంత్రి దత్తత తీసుకోవడం అదృష్టమని స్థానికులు భావిస్తున్నారు. సీఎం చెప్పిన విధంగా నడుచుకొని బంగారు వాసాలమర్రిగా మార్చేందుకు తమవంతు కృషి చేస్తామని చెబుతున్నారు.