కరోనా కట్టడిలో భాగంగా నిత్యం వందల మందిని కలిసే అవకాశమున్నవారిని సూపర్ స్ప్రెడర్లు(Super Spreader)గా గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం... వారందరికీ టీకాలు వేయాలని నిర్ణయించింది. వారికోసం ఇవాళ్టి నుంచి 3రోజులపాటు ప్రత్యేకంగా టీకా పంపిణీ(special vaccination drive) చేపట్టింది. పౌరసరఫరాల శాఖ సిబ్బంది, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, వీధి వ్యాపారులు, జర్నలిస్టులు, వివిధ దుకాణాల్లో పనిచేసే వారికి సూపర్ స్ప్రెడర్ల కేటగిరీలో వ్యాక్సిన్ వేయనున్నారు.
పౌర సరఫరాల విభాగంకింద 85,031 మందికి, జర్నలిస్టులు(journalists) 20వేల మంది, జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఆటో, క్యాబ్‌డ్రైవర్లు(cab drivers) 3 లక్షల మంది, రైతుబజార్లలోని వ్యాపారులు, పూలు, పండ్ల దుకాణదారులు, మద్యం దుకాణాల్లో పనిచేసే సిబ్బంది, కిరాణ దుకాణదారులు, మాంసం వ్యాపారులుసహా జీహెచ్‌ఎంసీ(ghmc) పరిధిలో మరో 3 లక్షల మందిని గుర్తించారు. వారందరికీ టీకా పంపిణీ చేసే బాధ్యతను సంబంధిత శాఖలకు అప్పగించారు. జర్నలిస్టులకు సమాచార పౌర సంబంధాల విభాగం, ఆటో,క్యాబ్ డ్రైవర్లకు రవాణా శాఖ, చిన్నవ్యాపారులు, సిబ్బందికి బల్దియా అధికారులు, ఫర్టిలైజర్, పెస్టిసైడ్ వ్యాపారులకు టీకా వేయించాల్సిన బాధ్యతను వ్యవసాయ శాఖకు అప్పగించారు.
ఇప్పటికే సంబంధిత శాఖలు అర్హులైన వారికి వ్యాక్సినేషన్ ఇచ్చే సమయం, టీకా కేంద్రాల వివరాలతో కూడిన సమాచారం అందించాయి. ప్రత్యేక టీకా పంపిణీలో భాగంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 16, పౌర సరఫరాలు(civil supply), సమాచార పౌర సంబంధాల శాఖ కలిపి మరో 20 కేంద్రాలను ఏర్పాటు చేశాయి. ఆయా కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచే వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరంతా ఆధార్‌తోపాటు.....గుర్తింపు కార్డు చూపెట్టాల్సి ఉంటుంది. కరోనా వ్యాప్తిని అరికట్టే దిశలో.. ప్రత్యేక టీకా పంపిణీ మరో అడుగు అని సర్కారు భావిస్తోంది.
ఇవీచూడండి: విజృంభిస్తున్న కరోనా.. కనిగిరిలో పూర్తి స్థాయి లాక్డౌన్