తెలంగాణలో ప్రజలకు కొవిడ్ టీకా వేయటంపై రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. టీకా అందుబాటులోకి రాగానే యుద్ధప్రతిపదికన అందించటానికి సర్కార్ పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. దీనిపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల సమీక్షలో పలుఅంశాలపై లోతుగా చర్చించారు. తొలి విడతలో దేశవ్యాప్తంగా 30 కోట్ల జనాభాకు టీకా వేయాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
10 వేల బృందాలు
రాష్ట్రంలో సుమారు 70 లక్షల నుంచి 75 లక్షల మందికి తొలి విడతలో టీకావేసే అవకాశాలున్నట్లు సర్కార్ భావిస్తోంది. నిర్ధేశించిన వ్యక్తులకు 2 డోసుల చొప్పున 3 నుంచి 4 వారాల వ్యవధిలో ఇవ్వాలి. ఈ లెక్కన రాష్ట్రానికి సుమారు కోటిన్నర డోసులు రానున్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. టీకాలు వేసేందుకు రాష్ట్రంలో 10వేల బృందాలను ఏర్పాటు చేస్తోంది. నర్సు, ఏఎన్ఎమ్, ఆశా కార్యకర్త... ఇలా ఒక్కో బృందంలో ముగ్గురూ ఉంటారు. బృందం రోజుకు వంద మందికి టీకాలిస్తుంది. ఈ బృందాలు ఒక్క రోజులో లక్ష మందికి... వారం రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మందికి టీకాలు వేస్తాయి. ఈ విధంగా చూస్తుండగానే లక్షిత ప్రజలకు కొవిడ్ టీకా తొలి డోసు పూర్తవుతుంది. మరో 3 నుంచి 4 వారాల వ్యవధిలో రెండో డోసు టీకాకు కూడా ఇదే కార్యాచరణ ఉంటుంది.
లక్ష్యం కోటి మంది
మరోవైపు... ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బందికి టీకా అందించటానికి సంబంధించి... దేశం మొత్తంలో కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యం కోటి మంది కాగా... రాష్ట్రంలో ఈ కేటగిరి కిందకు సుమారు 3 లక్షల మంది రానున్నారు. ఈ జాబితాను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. ఈ గణాంకాలను తిరిగి అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు. తప్పుడు సమాచారంతో కొవిడ్ టీకాను పొందే అవకాశమున్నందున... జాబితాలో పేర్కొన్న ఉద్యోగి పేరు, వృత్తి, పని ప్రదేశం, తదితర వివరాలను సరిచూస్తున్నారు. మూణ్నాలుగు రోజులుగా ప్రచారోగ్య సంచాలకుని కార్యాలయంలో ఇదే విషయమై ప్రత్యేక విభాగం పనిచేస్తోంది.
పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు
దేశంలో 50 ఏళ్లు పైబడిన 26 కోట్ల మందికి టీకా ఇచ్చే విభాగానికి సంబంధించి... రాష్ట్రంలో 60 లక్షల నుంచి 65 లక్షల మంది వరకు ఉంటారని అంచనా. అలాగే, 50 ఏళ్లలోపు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారికి కోటి మందికి టీకా ఇవ్వాలన్నది లక్ష్యం. కాగా... రాష్ట్రంలో ఇలాంటి వారు సుమారు ఆరు లక్షల మందికి పైగా ఉంటారని భావిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, రవాణా ఉద్యోగులు, పాత్రికేయులు తదితరులకు సంబంధించి లక్ష్యం 2 కోట్ల మంది కాగా... రాష్ట్రంలో ఈ కేటగిరి కింద సుమారు 2 లక్షల మంది వరకూ ఉంటారని ప్రాథమికంగా గుర్తించారు. సమగ్ర వివరాల సేకరణ అనంతరం వీటిపై స్పష్టత రానుంది. అయితే ఈ కేటగిరిలన్నింటిలోనూ కొందరు వేర్వేరు విభాగాల పరిధిలోకి వచ్చే అవకాశాలున్నాయి. ఉదాహరణకు 50 ఏళ్లు దాటిన వారిలో వైద్య సిబ్బంది, పోలీసులు వంటి వారు కూడా ఉంటారు. ఇలాంటి వారిని ఏదో ఒక్క కేటగిరి కిందే తీసుకోవటం ద్వారా మరింత ఎక్కువ మందికి టీకాలిచ్చే అవకాశాలుంటాయని వైద్యశాఖ భావిస్తోంది.
వేగంగా అందించటానికి
టీకాలు ఇవ్వటం మొదలుపెట్టిన తేదీకి, ముగింపు తేదీకి మధ్య ఎక్కువ వ్యవధి ఉండకూడదని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే వేగంగా టీకాలను అందించటానికి ప్రణాళికలను సిద్ధం చేసింది. గతంలో మిషన్ ఇంద్ర ధనుష్, మీజిల్స్-రుబెల్లా తదితర టీకాలను చక్కగా అందించిన అనుభవం రాష్ట్రంలోని ఆరోగ్య సిబ్బందికి ఉంది. ఇప్పుడు ఈ అనుభవం ఉపయోగపడుతుందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. కరోనా కొత్త జబ్బు కావటంతో మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. టీకాలు వేసేందుకు అవసరమైన శిక్షణను నర్సులు, ఏఎన్ఎమ్లకు అందిస్తున్నారు. టీకాలు వేసే క్రమంలో అనుకోని విధంగా ఏమైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే ఎలా వ్యవహరించాలనే దానిపైనా శిక్షణ ఇవ్వనున్నారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రం స్థాయిలో ఎలా సత్వర చికిత్స అందించాలి... ఆ తర్వాత స్థాయి ఆస్పత్రుల్లో ఎటువంటి చికిత్సలకు సన్నద్ధమవ్వాలనే శిక్షణను కూడా వైద్యులకు అందిస్తున్నారు.
అవసరాలకు తగ్గట్లుగా
ఇదిలా ఉండగా... కొవిడ్ టీకాలను నిల్వ ఉంచటం అత్యంత ప్రాధాన్యాంశం కావటంతో ప్రభుత్వం అతిశీతల యూనిట్‌లను యుద్ధప్రతిపాదికన సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతీయ కేంద్రాల్లో ఇప్పటికే మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద టీకాలను నిల్వచేసే సామర్థ్యమున్న అతిశీతల పరికరాలున్నాయి. రాష్ట్రంలో ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించే సామర్థ్యమున్న అన్ని ప్రయోగశాలల్లోనూ మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద టీకాను నిల్వచేయవచ్చు. అవసరాలకు తగ్గట్లుగా మరికొన్ని అతిశీతల పరికరాలను కూడా త్వరలో కొనుగోలు చేయనున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.