హైదరాబాద్‌లో జోరుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు నీటమునగగా.. రహదారులు జలమయమయ్యాయి. ప్రధాన కూడళ్లు, కాలనీలు, బస్తీలు వర్షపు నీటితో నిండిపోయి చెరువులను తలపించాయి. నాలాలు, మ్యాన్‌హోళ్లు పొంగిపొర్లాయి. ద్విచక్రవాహనాలు వరదనీటిలో కొట్టుకుపోయాయి.
ట్రాఫిక్‌లో చిక్కుకుని వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. కొన్ని బస్తీల్లో ఇళ్లల్లోకి వరదనీరు చేరగా స్థానికులు బయటకు తోడిపోశారు. అపార్టుమెంట్ల సెల్లార్లలోకి నీరు చేరి అక్కడ నిలిపి ఉంచిన వాహనాలు నీట మునిగాయి. మేడిపల్లి వద్ద గోడ కూలి ఇద్దరు దుర్మరణం చెందగా.. ఆసిఫ్‌నగర్‌లో గోడ కూలడం వల్ల రెండు ద్వచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. ఏఎస్ రావునగర్‌లో ప్రధాన రహదారి కుంగిపోయింది.
- వర్షానికి అతలాకుతలం..
భారీ వర్షాలకు నగరంలోని కూకట్‌పల్లి, మియాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, ఆమీర్‌పేట, బోరబండ, ఎస్ఆర్ నగర్, ఖైరతాబాద్, పంజాగుట్ట, బేగంపేట్, మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, సరూర్‌నగర్, సికింద్రాబాద్.. తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌జామ్ అయింది. పలు చోట్ల రోడ్లపై వరదనీరు చేరి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
కుండపోత వర్షానికి మాదాపూర్ నుంచి టోలిచౌకి, మెహిదీపట్నం, గుడిమల్కాపూర్, కార్వాన్, లంగర్‌హౌస్‌తో పాటు చార్మినార్, శాలిబండ, బహదూర్‌పురా, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, సికింద్రాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, హిమాయత్‌నగర్, లిబర్టీ కూడలి తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. అంబులెన్స్‌లు ట్రాఫిక్‌లో చిక్కుకుపోగా రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జీహెచ్ఎంసీ, జలమండలి సిబ్బందితో పాటు పోలీసులు సహాయక కార్యక్రమాలు చేపట్టారు.
- అత్యధిక వర్షపాతం..
నగరంలోని చందులాల్ బారాదరిలో 109.8 మిల్లీమిటర్ల అత్యధిక వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. షేక్‌పేట్‌లో 109.3 మిల్లీమీటర్ల వర్షం కురవగా... అత్తాపూర్‌లో 104.3, గౌతంనగర్‌లో 97.3, టోలిచౌకిలో 96.8మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజేంద్రనగర్‌లో 96.8 మిల్లీమీటర్లు, రంగారెడ్డి జిల్లా తొర్రూర్‌లో 88.5, దూద్‌బౌలిలో 88, సులేమాన్ నగర్‌లో 83.5, ఉప్పల్‌లో 82.8, శ్రీనగర్ కాలనీలో 80.8, ఖాజాగూడలో 80.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.