తుంగభద్ర నది పుష్కరాలకు 40 రోజుల గడువుంది. ఏయే పనులు చేపట్టాలో ప్రతిపాదనలు సిద్ధమైనా అవి పాలనామోదం పొందలేదు. సెప్టెంబరు చివర్లో కర్నూలు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, ఇతర మంత్రులు కలిసి పుష్కరాల ఏర్పాట్లపై విజయవాడలో సమీక్ష నిర్వహించారు. అప్పటికే సిద్ధమైన ప్రతిపాదనల్ని తగ్గించి పంపాలని సూచించారు. ఆ బాధ్యతను కర్నూలు కలెక్టర్‌కు అప్పగించారు. ప్రతిపాదనల్ని సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపినా ఇంకా పాలనామోద ఉత్తర్వులు రాలేదు.
తుంగభద్రకు నవంబరు 20 నుంచి 12 రోజుల పాటు పుష్కరాలు నిర్వహించనున్నారు. నదికి సుమారు 220 కిలోమీటర్ల తీరం ఉంది. కర్నూలు జిల్లా వారే కాక ఇతర ప్రాంతాల నుంచీ భక్తులు పెద్దసంఖ్యలో వచ్చి స్నానాలు ఆచరిస్తారు. ఆలూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు, నందికొట్కూరు, ఆత్మకూరు నియోజకవర్గాల్లో వివిధ చోట్ల ఘాట్ల నిర్మాణం చేపట్టాలని జలవనరుల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. తొలుత రూ.190.98 కోట్ల విలువైన పనులు చేపట్టాలనుకున్నారు. అనేక వడపోతల తర్వాత రూ.22.92 కోట్ల విలువైన ఘాట్ల నిర్మాణం, ఇతరత్రా పనుల్ని చేపట్టాలని భావించారు. ఆ మేరకు జలవనరుల శాఖ నుంచి రెండు రోజుల కిందట ఆర్థికశాఖకు ప్రతిపాదనలు వెళ్లాయి. అవి తిరిగి జలవనరుల శాఖకు వచ్చాకే పాలనామోదం లభిస్తుంది. షార్ట్ టెండర్ నోటీసులు ఇచ్చినా కనీసం 14 రోజుల గడువు అవసరం. ఒప్పందం కుదుర్చుకోవడం, అవసరమైన యంత్ర సామగ్రిని నిర్మాణ స్థలాలకు చేర్చుకోవడంతోనే మరికొంత కాలం గడిచిపోతుంది. ఇక పనుల పూర్తికి మిగిలే సమయం ఎంత? అనేది చర్చనీయాంశమైంది.
ఇదీ చదవండి: ఇరు రాష్ట్రాల నీటి కేటాయింపులపై కేంద్రం నివేదిక