తెలంగాణలో సకల జనుల సామూహిక దీక్ష నేపథ్యంలో హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బారికేడ్లను తోసుకుని ఆర్టీసీ కార్మికులు, విపక్షనేతలు, విద్యార్థి సంఘాల నేతలు దూసుకెళ్లారు. ట్యాంక్ బండ్ పైనున్న వెంకటస్వామి విగ్రహం వద్దకు చేరుకున్నారు. సచివాలయం నుంచి ట్యాంక్‌బండ్ వైపు కార్మికులు, విపక్ష నేతలు పరుగులు పెట్టారు. బారికేడ్లు, కంచెలు దూకి మహిళా కార్మికులు ట్యాంక్‌బండ్ మీదకు దూసుకెళ్లారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేసి.. పలువురిని అరెస్టు చేశారు.
అరెస్టుల పర్వం
ఇవాళ తెల్లవారుజామునుంచే అరెస్టుల పర్వం కొనసాగింది. లిబర్టీ కూడలి వద్ద ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని అరెస్ట్ చేసి లంగర్ హౌస్‌కు తరలించారు. ఇందిరా పార్కు వద్ద కోదండరాంను, భాజపా ఎంపీ బండి సంజయ్, వివేక్‌ను అదుపులోకి తీసుకున్నారు. అంబర్‌పేట్‌లో ఆర్.కృష్ణయ్యను అరెస్ట్ చేశారు. అశోక్‌నగర్, ఇందిరాపార్కు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మక్దుం భవన్ నుంచి ట్యాంక్‌బండ్ వైపు వెళ్లిన సీపీఎం నేతలు తమ్మినేని, జూలకంటి, విమలక్క, ఇతర నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
నేతల గృహ నిర్బంధం
తెదేపా నేతలు ఎల్.రమణ, రావులను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. భాజపా ఎమ్మెల్యే రాజా సింగ్, భాజపా నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి గృహనిర్బంధం చేశారు. ట్యాంక్‌బండ్‌కు బయలుదేరిన ఓయూ విద్యార్థి నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఓయూ ప్రాంగణం నుంచి వెళ్లే అన్ని రోడ్లను మూసివేశారు.
ఆంక్షలు
తెల్లవారుజాము నుంచే వివిధ జిల్లాల నుంచి వచ్చే నేతలు, కార్మికులను అడ్డుకునేందుకు వాహన తనిఖీలు నిర్వహించారు. పలు చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. నగరంలోని పలు మార్గాల్లో వాహనాల రాకపోకలపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మరికొన్ని మార్గాల్లో వాహన రాకపోకలను మళ్లించారు. ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. లిబర్టీ, ట్యాంక్‌బండ్‌పైకి వచ్చే అన్ని మార్గాలను తమ అధీనంలోకి తీసుకున్నారు.