రాహుల్ గాంధీ ముఖాముఖి అనుమతి కోసం అందిన దరఖాస్తును పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీని హైకోర్టు ఆదేశించింది. ఓయూలో రాహుల్ గాంధీ కార్యక్రమానికి అనుమతివ్వాలని కోరుతూ ఎన్ఎస్‌యూఐ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టుకు వేసవి సెలవులు ఉన్నందున అత్యవసరంగా హౌజ్ మోషన్ విచారణ జరపాలని కోరారు. అంగీకరించిన జస్టిస్ విజయసేన్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం అత్యవసర విచారణ చేపట్టారు.
ఉస్మానియా యూనివర్సిటీకి గత నెల 22న దరఖాస్తు చేసినప్పటికీ... ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం వెల్లడించడం లేదని లేదని పిటిషనర్లు మానవతరాయ్, ప్రతాప్ రెడ్డి, జగన్నాథ్ యాదవ్, చందనరెడ్డి పేర్కొన్నారు. రిజిస్ట్రార్‌ను వ్యక్తిగతంగా కలిసినప్పటికీ... అనుమతివ్వడం లేదని.. స్పందించడం లేదన్నారు. ఓయూలో రాహుల్ గాంధీ పర్యటన వెనక రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు. ఎంపీగా విద్యార్థులను చైతన్యపరచే ఉద్దేశంతో రానున్నారని పిటిషన్ తరఫు న్యాయవాది కరుణాకర్ వాదించారు. ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో రాహుల్ కార్యక్రమానికి అనుమతివ్వాలని కోరారు. అనుమతి ఇస్తే ఇతర ఏర్పాట్లు చేసుకుంటామని వెల్లడించారు. వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం దరఖాస్తును పరిశీలించి ఈనెల 5 నాటికి దరఖాస్తుదారులకు తెలపాలని ఆదేశిస్తూ విచారణ ముగించింది.
అయితే పిటిషన్‌పై విచారణకు ముందే... దరఖాస్తును తిరస్కరిస్తూ ఓయూ ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం. దరఖాస్తును తిరస్కరిస్తున్నట్లు సోమవారం మధ్యాహ్నం ఓయూ ప్రకటించింది. క్యాంపస్‌లో ఎలాంటి రాజకీయ కార్యక్రమాలకు అనుతివ్వరాదని గతేడాది పాలక మండలి తీర్మానం చేసినందున రాహుల్ గాంధీ కార్యక్రమానికి అనుమతివ్వలేమని ఓయూ తెలిపింది. ఉద్యోగ సంఘాల ఎన్నికలు, పరీక్షలు కూడా ఉన్నాయని పేర్కొంది.
ఇదీ జరిగింది... రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేతలు... అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వంపై పోరుకూ సిద్ధమవుతున్నారు. మే 6వ తేదీన రాహుల్ గాంధీ... వరంగల్‌కు వచ్చి అక్కడ ఏర్పాటు చేయనున్న బహిరంగసభలో పాల్గొననున్నారు. మే 7న హైదరాబాద్‌లో పార్టీ నేతలతో సమావేశం సహా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీటితో పాటు ఓయూలో విద్యార్థులతో సమావేశం కావాలని పీసీసీ ప్రణాళిక రూపొందించారు. అయితే ఉస్మానియా వర్సిటీలో పర్యటనకు వీసీ అనుమతిని ఇవ్వకపోవడంపై.... విద్యార్థి సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా వారిని అదుపులోకి తీసుకున్నారు. ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు బలమూరి వెంకట్ సహా 18 మందిని ఆదివారం అరెస్టు చేసి జైలుకు తరలించారు. సోమవారం చంచల్‌గూడ జైలులో విద్యార్థి నాయకులను పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.... రాహుల్ గాంధీ ఉస్మానియా విశ్వవిద్యాలయంతో పాటు చంచల్ గూడ కారాగారాన్ని సందర్శిస్తారని తేల్చి చెప్పారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాలను నియంత్రించలేరని అన్నారు.
ఇదీలా ఉంటే... ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాహుల్ గాంధీ కార్యక్రమానికి అనుమతివ్వాలంటూ కాంగ్రెస్ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. ఈనెల 7న విద్యార్థులతో ముఖాముఖికి అనుమతి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. మానవతారాయ్ సహా నలుగురు పిటిషన్ దాఖలు చేయగా... హౌస్‌మోషన్ పిటిషన్‌గా తీసుకుని విచారణ జరపాలని కోరారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు.. ఓయూ అధికారులకు పిటిషనర్ల దరఖాస్తును పరిశీలించాలని ఆదేశించింది. అంతకుముందే ఓయూ దరఖాస్తును తిరస్కరిస్తూ ఓయూ ఉత్తర్వులు ఇచ్చేసింది.
ఇదీ చదవండి: విజయవాడ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్.. ఆధార్ కార్డులో ఫొటో మార్ఫింగ్ చేసి కొరియర్!