లాక్‌డౌన్‌తో పరిశ్రమల్లో పనిచేసే ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. ఉన్న చోట పని లేదు. సొంత ఊళ్లకు వెళ్లే మార్గం లేదు. తాత్కాలిక వసతి గదుల్లో కాలం నెట్టుకొస్తున్నారు. కడుపు నిండా అన్నం లేక.. కష్టాల్ని పంచుకోవడానికి నా అన్నవారు లేక ఇబ్బందిపడుతున్నారు. అనంతపురం, విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లోని వివిధ పరిశ్రమల్లో పనిచేయటానికి వచ్చి లాక్‌డౌన్‌లో చిక్కుకున్న వేలాది మంది కార్మికుల బాధలివి.
కుటుంబానికి దూరంగా ..
విశాఖపట్నంలో పలు రాష్ట్రాల నుంచి పనిచేయటానికి వచ్చిన వారు 20 వేల మంది వరకూ ఉంటారు. ఈ కార్మికుల్లో సొంత ఊళ్లకు వెళ్లిన వారు కాకుండా సుమారు 7 వేల మంది లాక్‌డౌన్‌లో చిక్కుకున్నారు. అచ్యుతాపురం సెజ్‌లోని పరిశ్రమల్లో పనిచేసే వారు అక్కడే తాత్కాలిక వసతి గదుల్లో ఉన్నారు. మరికొందరు నగరంలో ఏర్పాటు చేసిన వసతికేంద్రాల్లో తలదాచుకుంటున్నారు.
* అనంతపురం జిల్లా హిందూపురం పారిశ్రామిక వాడలోని పరిశ్రమల్లో పనిచేయటానికి ఉత్తరప్రదేశ్, బిహార్, తమిళనాడు ప్రాంతాల నుంచి సుమారు 5 వేల మంది కార్మికులు వచ్చారు. లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత కొందరు ఎలాగోలా సొంత ఊళ్లకు బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం 2500 మంది ఇక్కడే నిలిచిపోయారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులను యాజమాన్యాలు పట్టించుకోవటం లేదు.
సొంత ఊరికి వెళ్లేది ఎలా: సంజయ్ యాదవ్, ఉత్తరప్రదేశ్
హిందూపురం పారిశ్రామిక వాడలో పనికోసం ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చాం. లాక్‌డౌన్‌తో పరిశ్రమ మూతపడినప్పటి నుంచి కష్టాలు పడుతున్నాం. భోజనానికీ ఇబ్బందిగా ఉంది. మా ఊరికి వెళ్లనిస్తే చాలు.
జీతం లేదు: బ్రిజ్ కిషోర్, బిహార్
లాక్‌డౌన్‌తో ఇక్కడ పనులు లేవు. జీతం ఇచ్చేది లేదని పరిశ్రమల నిర్వాహకులు చెప్పారు. కుటుంబాన్ని వదలి వచ్చాను. సొంతూరికి పంపాలని వేడుకుంటున్నా.
ఇవీ చదవండి...అర్ధాకలితో బిక్కుబిక్కు ....మందుల కొనుగోలుకూ డబ్బుల్లేవ్..!