AP Crime News: రాష్ట్రంలో పలు చోట్ల ప్రమాదాలు, హత్యలు, హత్యాయత్నాలు, ఆత్మహత్యలు, కుటుంబ కలహాలు, పోలీసుల తనిఖీలు, ఇతర ఘటనలు చోటుచేసుకున్నాయి. కుటుంబ కలహాలతో భర్త భార్యను హతమార్చగా.. ఆస్తి కోసం భర్తను చంపేందుకు భార్య సుపారీ ఇచ్చిన ఘటనలూ చోటు చేసుకున్నాయి. స్నానికి వెళ్లిన ఇద్దరు బాలురు గోదావరి ఊబిలో చిక్కి మృతి చెందారు. అధిక రక్తస్రావంతో బాలింత ఆసుపత్రిలోనే మరణించింది. పోలీసుల తనిఖీల్లో నాటుసారా, బెల్లం ఊట స్వాధీనం చేసుకున్నారు.
స్నానానికి వెళ్లి..ఊబిలో కూరుకుపోయి ఇద్దరు బాలురు మృతి..
తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం బడుగువాణిలంక గోదావరిలో స్నానానికి దిగిన ఇద్దరు బాలురు మృతి చెందారు. చెముడులంకకు చెందిన రోక్కాల రోహిత్(15), సాకా రాహుల్ (14) సరదాగా స్నానం చేసేందుకు బడుగు వాణి లంక గోదావరి వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు నదిలోని ఊబిలో కూరుకుపోయి ఇద్దరూ మరణించారు.
జైలు నుంచి తప్పించుకున్న నిందితున్ని పట్టుకున్న పోలీసులు..
కర్నూలు జిల్లా కారాగారం నుంచి తప్పించుకున్న నిందితుడు చెంచు కుళాయి అలియాస్ నానిని పోలీసులు పట్టుకున్నారు. హత్యాయత్నం కేసులో నిందితుడుగా ఉన్న నాని గురువారం ఉదయం బహిర్భూమికి వెళ్తానని చెప్పి గోడ దూకి జిల్లా కారాగారం నుంచి తప్పించుకుని పారిపోయాడు.గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ప్రకాశం జిల్లా దిగువమెట్టలో నిందితున్ని పట్టుకున్నారు.కాగా నిందితుడు నాని ఒకే వారంలో జైలు నుంచి రెండు సార్లు తప్పించుకొని దొరికాడు.
ఇరువర్గాల మధ్య ఘర్షణ...ఒకరికి గాయాలు..
కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుడ్లూరు గ్రామంలో వైకాపాలోని ఇరు వర్గాల మధ్య ఘర్షణతో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. హోలీ ఊరేగింపు విషయంలో వారి మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. రెండు సామాజిక వర్గాల నడుమ గొడవ జరగడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.ఈ ఘర్షణలో ఒకరికి గాయాలయ్యాయి. చివరికి పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది.
నిచ్చెన పైనుంచి జారి వ్యక్తి మృతి..
తూర్పు గోదావరి జిల్లా పిగన్నవరంలో కురిడి కొబ్బరికాయలు నిల్వ ఉంచే అరప ఎక్కుతూ నిచ్చెన పైనుంచి జారిపడి పాలానికి చెందిన నారాయణ రావు(53) మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
అధికారుల తనిఖీలు..నాటుసారా,బెల్లం ఊట ధ్వంసం...ఐదుగురు అరెస్ట్..
ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలోని ఆదినారాయణపురం రామ్ నగర్ లలో పోలీసులు,ఎస్ఈబి అధికారులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇరవై లీటర్ల నాటుసారా,పదిహేను వందల లీటర్ల బెల్లం ఊటను స్వాధీనం చేసుకున్నారు.పలు నేరాలకు పాల్పడిన ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు.
భర్త చేతిలో భార్య హతం
అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో బోయ నాగలాపురం వెంకటేశులు అనే వ్యక్తి తన భార్య వెంకటలక్ష్మమ్మను తాగిన మైకంలో రోకలి బండతో మోది హతమార్చాడు. భార్యభర్తలిరువురు గత కొంతకాలంగా కంబదూరులో ఇల్లు అద్దెకు ఉంటున్నారని...తరచూ గొడవలు పడేవారని స్థానికులు తెలిపారు. రాత్రి పొద్దుపోయాక జరిగిన ఘర్షణలో రోకలి బండతో కొట్టడంతో తీవ్రంగా గాయపడినట్లు, అధిక రక్తస్రావంతో వెంకటలక్ష్మమ్మ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
భర్త హత్యకు భార్య సుపారీ..
అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో శ్రీనివాసులు అనే వ్యక్తిని హత్య చేసేందుకు అతని భార్య దివ్యభారతి కుట్ర పన్నింది. రౌడీషీటర్లకు రూ.10 లక్షలు సుపారీ ఇచ్చింది. పథకం ప్రకారం శ్రీనివాసులును హతమార్చేందుకు నలుగురు యువకులు కాపు కాశారు. సీన్ లోకి వచ్చిన పోలీసులు వారి కుట్రను భగ్నం చేశారు. వారి వద్ద నుంచి కారం పొడి, రెండు ఇనుప రాడ్డులు, ఒక సుత్తిని స్వాధీనం చేసుకున్నారు.
శ్రీనివాసుల పేరుతో 10కోట్లకు పైగా ఆస్తులు ఉండటంతో అతని భార్య దివ్య భారతి, ఆమె సోదరి కవిత కలిసి ఆస్తి కోసం ఈ హత్యకు పథకం రచించారని పోలీసులు తెలిపారు. శ్రీనివాసులను హత్య చేసేందుకు అడ్వాన్సుగా 30వేల నగదును ప్రవీణ్,లక్ష్మీపతి,మున్నా,శివ కుమార్ అనే రౌడీషీటర్లకు ఇచ్చినట్లు వివరించారు. వీరి ఆరుగురిపైనా కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపినట్లు ధర్మవరం పట్టణ సిఐ కరుణాకర్ తెలిపారు.
అనుమానంతో మహిళను వివస్త్రను చేసి..కట్టేసి...చితకబాది..
అనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణం చోటుచేసుకుంది. పట్టణంలోని ఆర్.అండ్.బి బంగ్లా సమీపంలో రోడ్డుపై పండ్ల వ్యాపారం చేస్తున్న మహిళను వివస్త్రను చేసి, కరెంట్ స్థంభానికి కట్టేసి చితకబాదారు.అదే ప్రాంతానికి చెందిన మోహన్ అనే వ్యక్తితో గత కొన్నేళ్లుగా ఆమెకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో మోహన్ కుటుంబీకులు ఈ దాడికి తెగబడ్డారు. అందరూ చూస్తుండగానే తనపై దాడి చేయడంతో బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. సమాచారం అందకున్న పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకుని దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు.కేసు నమోదు చేసిన అనంతరం బాధిత మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సెల్ ఫోన్ల చోరీ ముఠా అరెస్ట్...
తెనాలి పరిసర ప్రాంతాల్లో ఒంటరిగా సంచరిస్తున్న వారి నుంచి సెల్‌ఫోన్లు అపహరించుకు వెళ్తున్న ముఠాను తెనాలి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 16 సెల్‌ఫోన్లు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచారు. కొల్లిపర మండలం తూములూరుకు చెందిన అమ్మిశెట్టి శివచందు, కొల్లిపర గ్రామానికి చెందిన తూమాటి శ్యామ్ కుమార్, అమిరే ఆనంద్ కిషోర్ లు సెల్‌ఫోన్ల చోరీలకు పాల్పడుతున్నట్లు డిఎస్పీ తెలిపారు. శుక్రవారం పోలీసులు కఠెవరం బ్రిడ్జి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితులు పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు.అప్రమత్తమై సిబ్బంది వారిని అదుపులోకి తీసుకుని విచారించగా సెల్‌ఫోన్ల చోరీ వెలుగు చూసిందని డిఎస్పీ కె స్రవంతి రాయ్ తెలిపారు.
చెట్టుకు ఉరివేసుకుని తాపీ మేస్త్రీ ఆత్మహత్య..
కృష్ణాజిల్లా కంచికచర్ల వసంత కాలనీకి చెందిన తాపీ మీస్త్రి లక్కీశెట్టి రామారావు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గొట్టుముక్కల రోడ్డు SS వైన్స్ సమీపంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మృతునికి భార్య ,ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గ్రామశివారులో చెట్ల మధ్య మృతదేహం..ఎవరిది..?
కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం ఎస్.అమరవరం గ్రామం వెళ్లే దారిలో చెట్ల మధ్యలో ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆరా తీశారు. కంచికచర్లలో గత అర్ధరాత్రి మద్యం సేవించిన చవట సురేష్ స్వగ్రామమైన ఎస్ అమరవరం బయలుదేరాడు. మార్గమధ్యలో మద్యం మత్తులో బైక్ అదుపు తప్పి కింద పడి..తలకు బలంగా దెబ్బ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లుగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు మృతదేహాన్ని నందిగామ మార్చరీకి తరలించారు.
అధిక రక్తస్రావంతో ఆసుపత్రిలో బాలింత మృతి...
గణపవరం గ్రామానికి చెందిన జగ్గవరపు నవ్యరెడ్డి(25) కాన్పు కోసం మైలవరంలోని అను ఆసుపత్రికి వెళ్లారు. అక్కడే ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే సిజేరియన్ ద్వారా కాన్పు చేసిన వైద్యులు అధిక రక్తస్రావం అవుతోందని విజయవాడ తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు సూచించారు.రాత్రి విజయవాడ తీసుకెళ్ళగా ఈ రోజు ఉదయం 9గంటల సమయంలో విజయవాడ హాస్పిటల్ లో మహిళ మృతి చెందింది. మైలవరం హాస్పిటల్ వద్దకు మృతి చెందిన మహిళ బంధువులు చేరారు. ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారమివ్వడంతో విషయం తెలుసుకుని ఉద్రిక్తత తలెత్తకుండా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఇదీ చదవండి : గొంతెండుతోంది.. మంచి నీళ్లు మహాప్రభో..