ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) షెడ్యూల్ వచ్చే నెల నాలుగు లేదా ఐదో తేదీన విడుదల కానుంది. షెడ్యూల్ ఇచ్చిన వారం తర్వాత దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన పాఠశాల విద్యాశాఖ కసరత్తు పూర్తి చేసింది. ప్రతి ఏడాది టెట్‌ను రెండు పర్యాయాలు నిర్వహించాల్సి ఉండగా గతేడాది ఫిబ్రవరిలో ఒక్కసారే నిర్వహించారు. ఈ ఏడాది ఉపాధ్యాయ నియామక పరీక్ష టీఆర్టీ నిర్వహించనున్నందున ముందుగానే టెట్ నిర్వహణకు షెడ్యూల్ రూపొందించారు. వ్యాయామ ఉపాధ్యాయులకు టెట్ నిర్వహించాలా..? వద్దా..? అనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గతేడాది నిర్వహించిన టెట్‌పై కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వల్ల ఈసారి ఇంతవరకూ నిర్ణయం తీసుకోలేదు. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లకు రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నందున ఆంగ్లం పేపరు వేరుగా ఉండనుంది.
ఆన్లైన్ ఉంటుందా?
గతేడాది టెట్‌ను మొదటిసారిగా ఆన్లైన్లో నిర్వహించారు. రాష్ట్రంలో కంప్యూటర్ల సదుపాయం లేకపోవటం వల్ల చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ల్లో పరీక్ష కేంద్రాలను కేటాయించారు. దీనిపై అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ టెట్ ఆన్లైన్లో నిర్వహించాలా..? ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలా? అనే దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. టెట్‌లో వచ్చే మార్కులకు టీఆర్టీలో 20 శాతం వెయిటేజీ ఉండటంతో ఈసారి టెట్ రాసే వారి సంఖ్య పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. మార్కుల మెరుగు కోసం ఒకటి రెండు పర్యాయాలు రాసిన వారు దరఖాస్తు చేసే అవకాశం ఉంది. ఒకసారి టెట్ రాస్తే ఏడేళ్ల వరకు అర్హత ఉంటుంది.
ఇవీ చూడండి: