Students agitation against new education policy: విజయవాడలో విద్యార్థి సంఘాలు చేపట్టిన బంద్ ఉద్రిక్తతకు దారి తీసింది. మొగల్రాజపురంలోని బోయపాటి రామకృష్ణయ్య నగర పాలక సంస్థ పాఠశాల ఎదుట విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన చేపట్టగా.. పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో విద్యార్థి సంఘాలు ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళన చేశాయి. పాఠశాలలు మెుదలై.. 2 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పుస్తకాలు పంపిణీ చేయలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యారంగ సమస్యల్ని అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని బాపట్లలో విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. సీఎం జగన్ ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ విజయనగరంలో విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని నిరసన తెలుపుతున్న విద్యార్థినులను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి వాహనంలో ఎక్కించారు. విశాఖలోని ప్రభుత్వ మహిళా కళాశాల నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు. మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచి, విద్యా వసతి, విద్యా దీవెన అర్హులందరికీ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. సర్కార్ నిర్ణయాలతో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యారంగ సమస్యలపై అనంతపురంలో విద్యార్థి సంఘాలు తలపెట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ నేతల్ని అరెస్ట్ చేశారు. మూడేళ్ల పాలనలో విద్యారంగాన్ని నాశనం చేశారని విద్యార్థి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో ఆందోళనకు యత్నించిన నేతల్ని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తూ కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థి నాయకులు ధర్నా చేయగా.. పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరిని విద్యార్థులు తప్పుపట్టారు. నంద్యాలలో వామపక్ష విద్యార్థి సంఘాలు ప్రభుత్వ వైఖరిపై ధ్వజమెత్తాయి. విద్యార్థులు చేపట్టిన ఆందోళన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోగా.. సర్కార్ అణిచివేత ధోరణి విడనాడాలని హెచ్చరించారు.
కడపలో విద్యార్థులు పాఠశాలల విలీనాన్ని, జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని ఆందోళన చేశారు. ప్రభుత్వం పాఠ్యపుస్తకాల్ని, విద్యా కానుక కిట్లను వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో జ్యోతిరావు పూలే కూడలి వద్ద విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్ధులు మానవహారంగా ఏర్పాడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం జగన్ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆరోపించారు.
ఇవీ చదవండి: