aided school teachers posting guidelines: ఎయిడెడ్ పాఠశాలల నుంచి ప్రభుత్వ బడుల్లోకి వచ్చిన బోధన, బోధనేతర సిబ్బందికి పోస్టింగ్‌లు ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆస్తులతో సహా అప్పగించిన ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని, తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో నియామకాలు చేపట్టాలని సూచించింది. ఎయిడెడ్ నుంచి వచ్చిన ప్రధానోపాధ్యాయులకు మొదట ఆస్తులతో సహా అప్పగించిన ఎయిడెడ్ బడుల్లో ఖాళీలు ఉంటే నియమించాలని, అనంతరం ప్రభుత్వ, జిల్లాపరిషత్తు, పురపాలక పాఠశాలల్లో నియామకాలు చేపట్టాలని పేర్కొంది. స్కూల్ అసిస్టెంట్లను ప్రభుత్వ పాఠశాలల్లో 30శాతం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఖాళీల్లో, నవంబరు 2020 తర్వాత ఏర్పడిన ఖాళీలు, ఎయిడెడ్ బడుల నుంచి విద్యార్థులు చేరిన ప్రభుత్వ పాఠశాలల్లో సర్దుబాటు చేయాలని సూచించింది. ఎస్జీటీలకు నూతన విద్యా విధానం ప్రకారం విద్యార్థులు, ఉపాధ్యాయ నిష్పత్తి ఆధారంగా పోస్టింగ్‌లు ఇవ్వాలని వెల్లడించింది. బోధనేతర సిబ్బందిని జిల్లా విద్యాధికారి కార్యాలయం యూనిట్‌గా పలు ఇతర కార్యాలయాలు, ప్రభుత్వ బడుల్లోని ఖాళీల్లో నియమించాలని పేర్కొంది.
ఇదీ చదవండి